- స్వీట్, పాన్ షాప్స్, బేకరీలకు సప్లయ్ చేస్తున్న కేటుగాళ్లు
- హైదరాబాద్‌లోని తయారీ కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు
- యూపీ నుంచి ముడిసరుకు.. పాతబస్తీలో తయారీ..సప్లయ్
- నలుగురు అరెస్ట్.. భారీగా నకిలీ వరఖ్ స్వాధీనం
హైదరాబాద్,వెలుగు: కాజు కట్లీ, కాజు రోల్స్ మొదలుకొని స్వీట్ పాన్, బేకరీ ఉత్పత్తుల వరకు మెరిసే వెండి పూత వెనుక కల్తీ మాయ బయటపడింది. వెండికి బదులు చౌకగా దొరికే అల్యూమినియంతో నకిలీ వరఖ్ తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. స్వీట్లు, ఆహార పదార్థాలపై ఈ పూతను వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి కల్తీ వరఖ్ తింటే కిడ్నీలు, ఎముకలు, జీర్ణ, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. పాతబస్తీ కేంద్రంగా సాగుతున్న ఈ దందాను సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుట్టురట్టు చేశారు. చార్మినార్, హుస్సేనీఆలం, మొగల్‌పురా, ఫలక్‌నుమాలోని తయారీ కేంద్రాలపై దాడులు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. భారీగా నకిలీ వరఖ్, ముడిసరుకు, తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను సీపీ మహేశ్‌భగవత్ మంగళవారం మీడియాకు వెల్లడించారు.
వెండి వరఖ్ కాదు.. ప్రాణాంతక అల్యూమినియం పూత
స్వీట్లతో పాటు పాన్‌లపై అలంకరణకు సిల్వర్ వరఖ్ వాడుతుంటారు. నిజమైన వెండితో తయారు చేసిన 50 గ్రాముల వరఖ్ ధర సుమారు రూ.9 వేలు ఉండగా, అల్యూమినియంతో తయారు చేసిన పూత 50 గ్రాములు కేవలం రూ.100కే లభిస్తోంది. ఈ ధర వ్యత్యాసాన్ని ఆసరాగా చేసుకున్న ముఠాలు యూపీ నుంచి అల్యూమినియం ఫ్లేక్స్ తెప్పించి నకిలీ వరఖ్ తయారు చేస్తున్నాయి. వాటిని జర్దా, ఖివామ్, వివిధ ఫ్లేవర్లతో కలిపి తయారు చేస్తున్నారు. అనంతరం కాజు కట్లీ, కాజు రోల్స్, ఛమ్‌ఛమ్ తదితర స్వీట్లపై అలంకరణ కోసం హోల్‌సేల్, రిటైల్‌గా విక్రయిస్తున్నారు. యూపీ కేంద్రంగా సాగుతున్న ఈ దందా ద్వారా హైదరాబాద్‌కు పెద్ద మొత్తంలో సరఫరా జరుగుతోంది.
పాతబస్తీలో తయారీ కేంద్రాలు..నిర్వాహకుల అరెస్ట్
చార్మినార్, హుస్సేనీఆలం, మొగల్‌పురా, ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ల పరిధిలోని నకిలీ వరఖ్ తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. 49 బండిళ్ల నకిలీ అల్యూమినియం లీఫ్స్, 10 కిలోల అల్యూమినియం ఫ్లేక్స్, 50 గ్రాముల చొప్పున ఉన్న 32 కవర్ల నకిలీ సిల్వర్ వరఖ్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు కిలో నకిలీ సిల్వర్ వరఖ్ చక్కెర బిళ్లలు, కిలో టాల్కమ్ పౌడర్, 50 కిలోల పొగాకు, 50 బాటిళ్ల ఫ్లేవర్డ్ పాన్ చట్నీలను పట్టుకున్నారు.
జంతు చర్మంతో తయారు చేసిన షీట్లకు సంబంధించిన ఐదు పుస్తకాలు, సుమారు 10 లీటర్ల గ్లూకోజ్, 40 కిలోల మొక్కజొన్న పిండి కూడా స్వాధీనం చేసుకున్నారు. తయారీకి ఉపయోగిస్తున్న మిక్సర్ గ్రైండర్, లాంగ్ మిక్సర్, ప్యాకింగ్ మెషీన్, తూకం యంత్రం, గ్యాస్ సిలిండర్, స్టవ్, ఇతర సామగ్రిని సీజ్ చేశారు. ఈ దందాతో సంబంధమున్న మహమ్మద్ అక్బర్ (45), మహమ్మద్ వలీ ఉద్దీన్ (62), మహమ్మద్ షరీఫ్ (60), మహమ్మద్ జలీల్ ఖాన్ (47)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
స్వీట్, పాన్ షాపులు, బేకరీలే టార్గెట్
టాల్కమ్ పౌడర్, పొగాకు సహా హానికర పదార్థాలతో తయారు చేస్తున్న అల్యూమినియం వరఖ్, చక్కెర బిళ్లలను కేకులు, బేకరీ ఉత్పత్తులపై టాపింగ్స్‌గా వాడేందుకు సరఫరా చేస్తున్నారు. బేగంబజార్‌తో పాటు పాతబస్తీలోని హోల్‌సేల్ షాపుల్లో ఏటా కోట్ల రూపాయల విలువైన నకిలీ వరఖ్ విక్రయాలు జరుగుతున్నాయి. ఆహార కల్తీపై నిఘా పెట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు యూపీ నుంచి వస్తున్న నకిలీ వరఖ్‌ను గుర్తించారు.
దీంతో బేగంబజార్ సహా నగరంలోని హోల్‌సేల్ మార్కెట్లపై నిఘా పెంచారు. వెండి వరఖ్ స్థానంలో చౌకగా లభించే అల్యూమినియం ఫ్లేక్స్‌ను ఉపయోగించి, వాటిని సిల్వర్ వరఖ్‌గా చిత్రీకరించి స్వీట్ల తయారీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. పండుగల సీజన్‌లో స్వీట్లు, పాన్‌లకు డిమాండ్ పెరగడంతో ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో ముడిసరుకు తెప్పించి తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
