రాష్ట్రంలో కొత్తగా 4 లక్షల పెన్షన్లు.. రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు: మంత్రి వివేక్

రాష్ట్రంలో కొత్తగా 4 లక్షల పెన్షన్లు.. రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు: మంత్రి వివేక్
  • మూడేండ్లలో మరో 2లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తాం 
  • మందమర్రి ఏజెన్సీప్రాంతంలో సింగరేణి స్థలంలో 600 ఇండ్లు కట్టిస్తం
  • మంచిర్యాల జిల్లాలో చేయూత పింఛన్ల పంపిణీ  

కోల్​బెల్ట్/చెన్నూరు, వెలుగు:రాజకీయాలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4లక్షలకు పైగా చేయూత పింఛన్లు మంజూరు చేసి.. నిరుపేద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీతా, చేనేత కార్మికులకు  ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్టు చెప్పారు. మంగళవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ,   జైపూర్, చెన్నూరులలో ఆరు మండలాలకు చెందిన 1,223 మంది లబ్ధిదారులకు కొత్తగా  చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులు పంపిణీ చేశారు. 

రూ.3.30కోట్లతో  చెన్నూరులో నిర్మించిన బీసీ మహిళా సంక్షేమ వసతి గృహ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఒక్క రేషన్​కార్డు, పెన్షన్ కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. మంచిర్యాల జిల్లాలో నవంబర్ నెలకు 10,529 కొత్త చేయూత పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. 

రాష్ట్రవ్యాప్తంగా దీపావళి పందర్భంగా 2 లక్షల ఇండ్లు మంజూరు చేశామని, వచ్చే మూడేండ్లలో మరో 2 లక్షల ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. చెన్నూర్ నియోజకవర్గానికి  5,500 ఇండ్ల మంజూరుకాగా   సుమారు 1,800 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. మందమర్రి ప్రాంతం ఏజెన్సీ పరిధిలో ఉన్న కారణంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు కోసం  సింగరేణి సంస్థకు చెందిన ఆరు ఎకరాల భూమిలో 600 ఇండ్లను నిర్మిస్తామన్నారు. ఈ నెల 19న సీఎం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా యోజన ప్రారంభిస్తారని చెప్పారు.

ఏటా రూ.80వేల కోట్ల మిత్తి కడుతున్నం

బీఆర్ఎస్​హయాంలో చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏటా రూ.80వేల కోట్లు మిత్తి కడుతోందని మంత్రి వివేక్​తెలిపారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా  ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. కేసీఆర్​కమీషన్ల కోసం నిర్మించిన కాళేశ్వరం  ప్రాజెక్టు వల్ల లక్ష కోట్ల ప్రజలసోమ్ము వృథా అయ్యిందన్నారు. బొగ్గు బ్లాక్​ల కేటాయింపు కోసం కేంద్రం ప్రవేశపెట్టిన వేలం బిల్లుకు బీఆర్ఎస్​ ఎంపీలు మద్దతు పలికారన్నారు. 

తాను సీఎం రేవంత్​రెడ్డిని ఒప్పించి సింగరేణి  వేలంలో పాల్గొని కొత్త బొగ్గు గనులను దక్కించుకునేలా చొరవచూపినట్లు చెప్పారు. త్వరలో రామకృష్ణాపూర్​ ఓసీపీ ఫేజ్​2 మైన్​ ఓపెన్, జైపూర్​లోని సింగరేణి థర్మల్​ పవర్​ ప్లాంట్​లో 850 మెగావాట్ల మూడో యూనిట్​ అందుబాటులోకి రానుందన్నారు. వీటి ద్వారా వేలాది మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. 

చెన్నూరులో రూ.800 కోట్లతో అభివృద్ది పనులు

చెన్నూరు నియోజకవర్గంలో సుమారు రూ.800 కోట్ల అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని మంత్రి వివేక్​ వెంకటస్వామి తెలిపారు.   గ్రామాల్లో పూర్తిస్థాయిలో సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్​ కుమార్​దీపక్, అడిషనల్​ కలెక్టర్​చంద్రయ్య, డీఆర్డీవో కిషన్, స్పెషల్​ ఆఫీసర్​ శ్రీనివాస్, అసిస్టెంట్​ బీసీ వెల్ఫేర్​ ఆఫీసర్​ క్రాంతికుమార్, క్యాతనపల్లి, చెన్నూరు మున్సిపల్​ చైర్​ పర్సన్లు డాక్టర్​ సంధ్యారాణి, పెద్దింటి పద్మ, వైస్​ చైర్మన్లు మిట్టపెల్లి సరిత, వినయ్​, డీసీసీ ప్రెసిడెంట్​రఘునాథ్​రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్​కుమార్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్​ కమిషనర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.