ధోనీ లేకుండా CSK లేదు.. ఇది ఎప్పటికీ అతని సొంత ఇల్లే: ఎన్‌‌‌‌. శ్రీనివాసన్‌

ధోనీ లేకుండా CSK లేదు.. ఇది ఎప్పటికీ అతని సొంత ఇల్లే: ఎన్‌‌‌‌. శ్రీనివాసన్‌

 చెన్నై: టీమిండియా లెజెండ్‌‌‌‌‌‌‌‌ మహేంద్ర సింగ్‌‌‌‌ ధోనీ 19 ఏళ్ల ఐపీఎల్‌‌‌‌ కెరీర్‌‌‌‌కు గుడ్‌‌‌‌బై చెప్పాడు. వచ్చే సీజన్‌‌‌‌ కోసం చెన్నై సూపర్‌‌‌‌కింగ్స్‌‌‌‌ (సీఎస్కే) తరఫున మెంటార్‌‌‌‌గా కీలక బాధ్యతలు స్వీకరించాడు. తన కెప్టెన్సీలో ఐదు ఐపీఎల్‌‌‌‌, రెండు చాంపియన్స్‌‌‌‌ లీగ్‌‌‌‌ టైటిల్స్‌‌‌‌ అందించిన మహీ చెపాక్‌‌‌‌లో వీడ్కోలు మ్యాచ్‌‌‌‌ ఆడాలన్న కల నెరవేరకుండానే మెగా లీగ్‌‌‌‌ నుంచి తప్పుకున్నాడు. డిసెంబర్‌‌‌‌ 16న గోవాలో జరగనున్న ప్లేయర్ల వేలానికి ముందు ఆటగాళ్లను విడుదల చేయడానికి, రిటేన్‌‌‌‌ చేసుకోవడానికి గడువు ముగియడానికి మూడు గంటల ముందు సీఎస్కే ఫ్రాంచైజీ మంగళవారం ఈ ప్రకటనను చేసింది. 

‘ధోనీ లేకుండా సీఎస్కే లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా విజయాలు, అపజయాలు వాటి మధ్య ఉన్న అన్నింటిలోనూ మేమిద్దరం కలిసి నడిచాం, ఎదిగాం’ అని సీఎస్కే ఓనర్‌‌‌‌ ఎన్‌‌‌‌. శ్రీనివాసన్‌‌‌‌ పేర్కొన్నాడు. తాము ఏనాడూ ఉద్దేశాలను ప్రశ్నించలేదని, ఆ నమ్మకమే ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని సుసాధ్యం చేసిందన్నాడు. ‘2008లో ధోనీ సీఎస్కేలో భాగం కావాలని నేను పట్టుబట్టాను. నేను తీసుకున్న నిర్ణయాల్లో అదే ఉత్తమమైనదని తేలింది. ఫ్రాంచైజీ కోసం అతను సాధించిన విజయాల వల్ల కాదు, అతను ఎలాంటి మనిషో అన్న కారణంతో నా నిర్ణయం సరైందని తేలింది. ధోనీ ఎల్లప్పుడూ మా గుర్తింపులో ఒక భాగంగా ఉంటాడు. ఇది ఎప్పటికీ అతని సొంత ఇల్లే’ అని శ్రీనివాసన్‌‌‌‌ వ్యాఖ్యానించాడు. 

సీఎస్కే తొలి సూపర్‌‌‌‌ కింగ్‌‌‌‌ ధోనీ..

2007 టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ను ఇండియాకు అందించడంలో కీలక పాత్ర పోషించిన మహీని 2008లో జరిగిన తొలి ఐపీఎల్‌‌‌‌ వేలంలో సీఎస్కే 1.5 మిలియన్‌‌‌‌ అమెరికన్‌‌‌‌ డాలర్లకు కొనుగోలు చేసింది. ధోనీ నాయకత్వంలో సీఎస్కే 2010, 2011, 2018, 2021, 2023 సంవత్సరాల్లో ఐపీఎల్ టైటిళ్లను, 2010, 2014లో చాంపియన్స్‌‌‌‌ లీగ్ టైటిళ్లను గెలుచుకుంది. 

వరుసగా రెండుసార్లు ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకున్న మొదటి జట్టుగా, అలాగే ఒకే ఏడాదిలో  ఐపీఎల్, చాంపియన్స్ లీగ్ రెండింటినీ గెలుచుకున్న మొదటి జట్టుగా సీఎస్కే చరిత్ర సృష్టించింది. తొలి 19 సీజన్లలో 17 ఏళ్ల పాటు ధోనీ సీఎస్కే తరపున ఆడాడు. కానీ బెట్టింగ్‌‌‌‌ వల్ల ఫ్రాంచైజీపై రెండేళ్ల నిషేధం విధించడంతో 2016, 2017 సీజన్లలో 'రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌‌‌‌కు' ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ కెరీర్‌‌‌‌లో మొత్తం 5439 పరుగులు చేశాడు. 

మధ్య మధ్యలో  కెప్టెన్సీ..

12  సీజన్ల పాటు సీఎస్కేకు నాయకత్వం వహించిన ధోనీ, 2022 సీజన్ ప్రారంభానికి ముందు కెప్టెన్సీ బాధ్యతలను రవీంద్ర జడేజాకు అప్పగించాడు. అయితే జట్టు ప్రదర్శన సరిగ్గా లేకపోవడంతో సీజన్ మధ్యలోనే తిరిగి నాయకత్వ బాధ్యతలను చేపట్టాడు. ఆ సీజన్‌‌‌‌లో జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచినప్పటికీ, ధోనీ నాయకత్వంలోనే పుంజుకున్న సీఎస్కే 2023లో ఐపీఎల్ టైటిల్‌‌‌‌ను కైవసం చేసుకుంది.

ఆ తర్వాత 2024 ఐపీఎల్ ప్రారంభానికి ఒక్క రోజు ముందు ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో జరిగిన ఆ సీజన్‌‌‌‌లో జట్టు ఐదో ప్లేస్‌‌‌‌లో నిలిచింది. 2025లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఐదేళ్ల క్రితమే రిటైర్ అయినందున ధోనీని 'అన్‌‌‌‌క్యాప్డ్' ఆటగాడిగా సీఎస్కే జట్టులో కొనసాగించారు.  అయితే  సీజన్ మధ్యలో గైక్వాడ్‌‌‌‌కు గాయం కావడంతో ధోనీ మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది.  

2024లో 11 ఇన్నింగ్స్‌‌‌‌లలో  కేవలం 73 బంతులు మాత్రమే ఎదుర్కోగా, ఐపీఎల్ 2025లో 13 ఇన్నింగ్స్‌‌‌‌లలో 145 బంతులు ఎదుర్కొన్నాడు. 2026లో గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సీఎస్‌‌‌‌కే మ్యాచ్‌‌‌‌లు జరిగినప్పుడు కూడా  మైదానంలో చాలా అరుదుగా కనిపించాడు. 2019 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్‌‌‌‌లో ఇండియా తరపున చివరిసారిగా ఆడిన మహీ 2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.  

కోచింగ్‌‌ బృందంలోకి..

2027 సీజన్‌‌ కోసం ఏర్పాటు చేసిన కొత్త కోచింగ్ బృందానికి 45 ఏళ్ల ధోనీ నాయకత్వం వహించనున్నాడు. హెడ్‌‌ కోచ్‌‌గా జహీర్‌‌ ఖాన్‌‌, అసిస్టెంట్‌‌ కోచ్‌‌లుగా ఆల్బీ మోర్కెల్‌‌, గారెల్‌‌ బాటీ, శ్రీధరన్‌‌ శ్రీరామ్‌‌, బౌలింగ్‌‌ కోచ్‌‌గా మోహిత్‌‌ శర్మ, ఫీల్డింగ్‌‌ కోచ్‌‌గా జేమ్స్‌‌ ఫోస్టర్‌‌ వ్యవహరించనున్నారు. గత మూడు సీజన్లలో సీఎస్కే ప్లే ఆఫ్స్‌‌కు చేరుకోవడంలో విఫలం కావడంతో ఫ్రాంచైజీ తమ కోచింగ్‌‌ బృందాన్ని సమూలంగా మార్చేసింది.