మీ ఇంటి తలుపు తట్టి మీరు ఆర్డర్ చేసిన దానిని మీకు అందించే వ్యక్తి ఎవరు? ఏ సమయంలోనైనా మిమ్మల్ని మీ గమ్యానికి సురక్షితంగా చేర్చే బైక్ రైడర్ ఎవరు? మీ సమయాన్ని మీ శ్రమను కాపాడే వ్యక్తి ఎవరు? అతనే ఈ 21వ శతాబ్దపు కార్మికుడు గిగ్ వర్కర్. అతడిని కంపెనీలు ‘పార్టనర్’ అంటాయి. చట్టం ‘ఎవరూ కాదు’ అంటుంది. ఈ అన్యాయమైన శూన్యాన్ని తొలగించడానికి తెలంగాణలో జరిగిన ప్రయత్నం ఇప్పుడు దేశానికి దిక్సూచి అవుతోంది. దానికి సారథి కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి.
నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం దేశంలో దాదాపు 77 లక్షల మంది గిగ్ వర్కర్స్ ఉన్నారు. 2030 నాటికి 2.35 కోట్లకు చేరుకుంటారు. తెలంగాణలోనే, మంత్రి వివేక్ వెంకటస్వామి స్వయంగా చెప్పినట్లుగా, సుమారు 6 లక్షల మంది గిగ్ వర్కర్స్ ఉన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోనే సుమారు 3 లక్షల మంది ఉన్నారు.
హైదరాబాద్ రైడర్ రోజు లెక్క
14 గంటలు, 20 ఆర్డర్లు చేస్తే గ్రాస్ - రూ.900. అందులో - పెట్రోల్ రూ.320 + బండి అద్దె రూ.130 + మెయింటెనెన్స్, భోజనం రూ.130 = రూ.580 ఖర్చు. చేతికి మిగిలేది రూ.320-–400 మాత్రమే.క్యాబ్ డ్రైవర్: కస్టమర్ రూ.200 ఇస్తే, కమిషన్ రూ.60, పెట్రోల్ రూ.60 పోను - మిగిలేది రూ.80. గిగ్ వర్కర్ ఆదాయం నెల జీతం కాదు, రోజూ యుద్ధం.
రోజుకు 14-–16 గంటలు పనిచేస్తే, పెట్రోల్, వాహన నిర్వహణ, చలాన్లు పోను మిగిలేది దాదాపు 600-– 800 రూపాయలు. కనీస వేతనం లేదు, పీఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ప్రమాద బీమా లేదు. ఆల్గోరిథం అనే అదృశ్య యజమాని ముందు వీరు నిరంతరం నేరస్తులుగా నిలబడాలి. ఒక్క కంప్లైంట్, ఒక్క లేట్ డెలివరీ చాలు - ఎటువంటి నోటీసు లేకుండా ఐడీ బ్లాక్. ప్రశ్నించడానికి మనిషి లేడు, చాట్ బాట్ మాత్రమే ఉంటుంది. ఇది టెక్నాలజీ కాదు, ఆధునిక వెట్టిచాకిరి.
వివేక్ మార్క్ విధానం-చట్టం కంటే ముందు వినడం
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వివేక్ వెంకటస్వామి ఐదు సార్లు గిగ్ వర్కర్ల యూనియన్లతో నేరుగా సమావేశమయ్యారు. కొండాపూర్‌లో వారితో కలిసి భోజనం చేసి, వారి బాధలు విన్నారు. డ్రాఫ్ట్ బిల్లును 30 రోజులు ప్రజల ముందు ఉంచారు. 65 సూచనలు వచ్చాయి, వాటన్నింటినీ చట్టంలో చేర్చారు.
‘ఉబర్ వంటి కంపెనీలు మేము వీరిని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించలేం అని చెప్పాయి. వాటిని ఒప్పించి, చట్ట పరిధిలోకి తెచ్చాం’ అని ఆయన స్వయంగా చెప్పారు. ఇది కేవలం పరిపాలన కాదు, సంకల్పం. ఫలితంగా 2026 మార్చి 30న అసెంబ్లీ ఆమోదించిన ‘తెలంగాణ ప్లాట్ ఫాం ఆధారిత గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం) బిల్లు -2026’ దేశంలోనే అత్యంత సమగ్రమైన చట్టంగా నిలిచింది. బిల్లును ప్రవేశపెడుతూ ఆయన అన్న మాటలు ఇప్పటికీ ప్రాసంగికం - ‘ఈ చట్టం డిజిటల్ ఎకానమీలో గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపు, హక్కులు, గౌరవం, జీవనోపాధిని ఇవ్వడానికి’.
చట్టం అమలు కీలకం
నవంబర్ 14న శిల్పకళా వేదిక నుండి హెచ్ఐసీసీ వరకు 6 లక్షల మంది తరపున జరిగిన ర్యాలీ - అది రాజకీయ సభ కాదు, ఆత్మగౌరవ సభ. ‘గిగ్ వర్కర్లు మాత్రమే ఉండాలి’ అని రాహుల్ గాంధీ స్వయంగా చెప్పారని మంత్రి తెలిపారు. ఇది వారికి ఇచ్చిన గౌరవం. చట్టం చేయడం గొప్ప విషయమే, కానీ అది ప్రారంభం మాత్రమే. మంత్రి వివేక్ వెంకటస్వామి స్వయంగా అంగీకరించినట్లు, కొన్ని కంపెనీలు ‘నష్టాల్లో ఉన్నాం’ అని సెస్ కట్టడానికి వెనకాడుతున్నాయి. ఇక్కడే ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి. యాప్ ఆధారిత రిజిస్ట్రేషన్ వెంటనే పూర్తి కావాలి. బోర్డు ఏర్పాటై, నిధి వినియోగం పారదర్శకంగా జరగాలి. 10 నిమిషాల డెలివరీ అనే ప్రాణాంతక ఒత్తిడిని నియంత్రించాలి. కిలోమీటరుకు కనీస ధరను నిర్ణయించాలి.
చరిత్రలో కొత్త అధ్యాయం
మంత్రి వివేక్ వెంకటస్వామి చేస్తున్న పని కేవలం ఒక వర్గానికి మేలు చేయడం కాదు, భారత కార్మిక చరిత్రలో కొత్త అధ్యాయం రాయడం. కనీస వేతన చట్టం ఎంత చారిత్రాత్మకమో, గిగ్ వర్కర్ల చట్టం కూడా అంతే చారిత్రాత్మకం. టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్లినా, మనిషిని మరిచిపోకూడదని ఆయన నిరూపిస్తున్నారు. డిజిటల్ ఇండియా అంటే యాప్‌లు కాదు, ఆ యాప్‌ల వెనుక ఉన్న మనుషులు. ఆ మనుషుల చెమటకు గుర్తింపు, భద్రత ఇచ్చినప్పుడే పురోగతికి అర్థం ఉంటుంది. తెలంగాణ ఆ అర్థాన్ని చూపించింది, వివేక్ వెంకటస్వామి ఆ బాటను వేశారు. ఇప్పుడు దేశం ఆ బాటలో నడవాలి.
గిగ్ వర్కర్స్ అంటే
6 రకాల పనులు చేసేవారు
ఫుడ్ డెలివరీ: గిగ్ వర్కర్లలో జోమాటో, స్విగ్గీ వంటి వాటిలో 40% మంది ‘ఫుడ్ డెలివరీ’ చేసేవారే.
క్విక్ కామర్స్: ఇప్పుడు ఇది అత్యంత వేగంగా
పెరుగుతోంది, జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్ బాస్కెట్.. పాలు, కూరగాయలు, గ్రాసరీ, మందులు అందజేస్తారు.
బైక్ ట్యాక్సీ / క్యాబ్: రోడ్డు మీద ఎక్కువ కనిపించేది - ఓలా, ఊబర్, రాపిడో, మనుషుల్ని తీసుకెళ్లడం. హైదరాబాద్‌లో 1 లక్ష మందికి పైగా దీనిలో ఉన్నారు.
కొరియర్ / పార్శిల్ / లాజిస్టిక్స్ - అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, డెల్హీవరీ, పోర్టర్, ఫోన్, బట్టలు, ఫర్నిచర్, ఇంటి సామాన్లు, ఆఫీస్ ఫైళ్లు, పోర్టర్లో ఇల్లు మార్చేందుకు సామాన్లు కూడా తీసుకెళ్తారు.
హోమ్ సర్వీస్ - ఇంట్లోకి వచ్చే వర్కర్లు - అర్బన్ కంపెనీ, హౌజ్‌జాయ్, స్నాబ్బిట్, ఏసీ రిపేరర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, బ్యూటీషియన్, క్లీనింగ్. వీళ్ళు కూడా గిగ్ వర్కర్లే.
ఫ్రీలాన్స్ డిజిటల్ గిగ్ -కనిపించని వర్కర్లు - ఫివ్వర్, అప్‌వర్క్, ఫ్రీలాన్సర్, లోగో డిజైన్, వీడియో ఎడిటింగ్, డేటా ఎంట్రీ, కంటెంట్ రైటింగ్, ఇంట్లో కూర్చొని ల్యాప్‌టాప్‌తో పని చేసే వీళ్ళు కూడా గిగ్ వర్కర్లే. మనం రోజూ వాడే ప్రతి యాప్ వెనుక ఒక గిగ్ వర్కర్ ఉన్నాడు.
చట్టంలో ఉన్న 5 స్తంభాలు
గుర్తింపు: ప్రతి వర్కర్‌కు ప్రత్యేక యూనిక్ ఐడీ. ఇకపై అతను అదృశ్యుడు కాదు, రాష్ట్ర గుర్తింపు పొందిన కార్మికుడు.
సంక్షేమ బోర్డు: కార్మికులు, కంపెనీలు, ప్రభుత్వం కలిసిన 20 మంది సభ్యులతో శాశ్వత బోర్డు.
సంక్షేమ నిధి: ప్రతి ఆర్డర్‌పై 1-2% సెస్. ఈ నిధి నుండే పెన్షన్, ప్రసూతి, విద్యా సహాయం. కంపెనీ లాభాల్లో కార్మికుడి వాటా అన్నమాట.
బీమా రక్షణ: రూ.5 లక్షల ప్రమాద బీమా, రూ.10 లక్షల ఆరోగ్య బీమా. నవంబర్ 14న రాహుల్ గాంధీ సమక్షంలో జరిగిన మహా
సభలో మంత్రి దీనిని ప్రకటించారు.
ఆల్గోరిథం న్యాయం: కారణం లేకుండా ఐడీ బ్లాక్ చేయకూడదు. 14 రోజుల ముందస్తు నోటీసు, కారణం చెప్పడం తప్పనిసరి. కంపెనీలు ప్రతి 3నెలలకు తప్పనిసరిగా రిటర్నులు దాఖలు చేయాలి. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గిగ్ వర్కర్ల న్యాయం గురించి చెప్పిన ఆకాంక్షను, తెలంగాణ ఆచరణలో చూపించిందని మంత్రి గుర్తుచేశారు.
- ఎం. రవీందర్
స్టేట్ జనరల్ సెక్రటరీ (టీమ్)
