- హైదరాబాద్‌లోని విద్యాశాఖ డైరెక్టరేట్ ముట్టడి
- స్కూల్ ఎడ్యుకేషన్‌లోవిలీనం చేయాలని డిమాండ్
- డైరెక్టర్‌తో చర్చలు విఫలం.. జేఏసీ నేతలు, టీచర్ల అరెస్ట్
హైదరాబాద్, వెలుగు:ట్రెజరీ ద్వారా 010 పద్దు కింద జీతాలివ్వాలని, తమను స్కూల్ ఎడ్యుకేషన్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ మోడల్ స్కూల్ టీచర్లు మంగళవారం హైదరాబాద్‌లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్(డీఎస్ఈ)ను ముట్టడించారు. మోడల్ స్కూల్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (ఎంఎస్ జేఏసీ) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీగా టీచర్లు తరలివచ్చారు. పోలీసులు వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో గేటు ముందు బైటాయించి నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్‌తో జేఏసీ స్టీరింగ్ కమిటీ నేతలు భూతం యాకమల్లు, తరాల జగదీశ్, కొండయ్య తదితరులు చర్చలు జరిపారు. ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. దీంతో టీచర్లు ఆందోళన కొనసాగించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి బేగంపేట, గోషామహల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్బంగా భూతం యాకమల్లు, తరాల జగదీశ్, కొండయ్య మాట్లాడుతూ..13 ఏండ్లుగా మోడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్నామని, కనీస సర్వీసు ప్రయోజనాలు, ఉద్యోగ, ఆర్థిక భద్రత కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండున్నరేండ్లుగా ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఒక్క సమస్యనూ పరిష్కరించలేదన్నారు. అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని, సీఎం జోక్యం చేసుకుని స్పష్టమైన హామీ ఇచ్చే వరకు పోరాటం ఆగదని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో ఎంఎస్ జేఏసీ నేతలు రాజు జాదవ్, వేణుగోపాల్ రెడ్డి, ఎల్. అరవింద్ ఘోష్, అప్పాల అశోక్, నాగేష్, మహేశ్, విఠల్, రాము, రూపస్, స్లీవ్ రాజ్, శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సాజిద్, రాజేందర్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
