- వీటితో పాటే రద్దుకానున్న తాత్కాలిక పర్మిట్
- రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే అమల్లోకి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టూరిస్టు బస్సుల యజమానులు కాంట్రాక్ట్ క్యారేజీ పర్మిట్ పేరుతో రవాణా శాఖ ఆదాయానికి భారీగా గండికొడుతుండడంతో...వారి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ట్రాన్స్పోర్టు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు ఉన్న మూడు రకాల పన్నులను రద్దు చేసి..వాటి స్థానంలో ఏక పన్ను ( ఒకే పన్ను ) విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. దీనిపై రవాణా శాఖ అధికారుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్రమైన నివేదికను పంపించింది. త్వరలోనే ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. ఆ వెంటనే తెలంగాణలో ఏక పన్ను విధానం అమలవుతుందని అధికారులు చెప్తున్నారు.
ఒకే పన్ను విధానం ఎందుకంటే..!
రాష్ట్రంలో సుమారు 8, 500 లకుపైగానే టూరిస్టు బస్సులున్నాయి. ఇందులో కొన్ని ఒక జిల్లాలో తిరిగేందుకు, మరి కొన్ని బస్సులు రెండు జిల్లాలు తిరిగేందుకు, ఇంకొన్ని బస్సులు రాష్ట్రం మొత్తం తిరిగేందుకు పర్మిట్లు పొందాయి. ఇలా మూడు రకాల పన్నులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఒక జిల్లా పర్మిట్ కోసం ప్రతి మూడు నెలలకు ఒక్కో సీటుకు రూ. 1120, రెండు జిల్లాల పర్మిట్ కోసం రూ. 1510, రాష్ట్ర పర్మిట్ కోసం రూ. 3,285 రవాణా శాఖకు చెల్లిస్తారు.
అయితే ఇక్కడే టూరిస్టు బస్సు యజమానులు రవాణా శాఖ ఆదాయానికి గండికొడుతున్నారు. చాలా మంది టూరిస్టు బస్సు యజమానులు.. ఒక జిల్లా రూట్ పర్మిట్(తక్కువ పన్ను ఉండే జిల్లా పర్మిట్) మాత్రమే తీసుకొని మరో జిల్లాకు తాత్కాలిక పర్మిట్( టీపీ ) పొందుతున్నారు. దీంతో రవాణా శాఖ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. దీన్ని రవాణా శాఖ అధికారుల కమిటీ గుర్తించి..ఒక జిల్లా, రెండు జిల్లాలు, రాష్ట్రం అనే మూడు రకాల పన్నుల విధానానికి స్వస్తి చెప్పి, రాష్ట్ర మొత్తానికి ఒకే పర్మిట్ ఇచ్చేలా కొత్త విధానం తీసుకురావాలని నిర్ణయించారు.
అలాగే, ఇప్పటి వరకు ఉన్న రాష్ట్ర పర్మిట్ పన్నును రూ . 3285 నుంచి ఏకంగా రూ. 1500 కు తగ్గించారు.దీనివల్ల రావాణా శాఖకు పెద్ద మొత్తంలో ఆదాయం రానుంది. టీపీల రూపంలో ప్రస్తుతం ప్రతి 3 నెలలకు ఒకసారి రవాణా శాఖకు కేవలం రూ. 4 కోట్లలోపే ఆదాయం వస్తుండగా..ఈ కొత్త విధానంతో ఆ ఆదాయం ఏకంగా రూ. 80 కోట్లకు పైగానే రానుందని అధికారుల కమిటీ తమ ప్రతిపాదనల్లో ప్రభుత్వానికి వివరించింది.
