- కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
- ఆంధ్రప్రదేశ్ సర్కారు తీరుపై మండిపాటు
- విభజన చట్టాన్ని తుంగలో తొక్కారని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీకి అట్టడుగున ఏపీ చేపడుతున్న ప్రాజెక్టుపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఎలాంటి అనుమతులు, కనీస సమాచారం లేకుండా గుట్టుగా పనులు చేస్తున్న ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడింది. కృష్ణా బోర్డు తీరునూ ఎండగట్టింది. ఈ మేరకు ఇటు కృష్ణా బోర్డుకు, అటు ఏపీ ఈఎన్సీకి తెలంగాణ ఈఎన్సీ తాజాగా లేఖ రాశారు. సాగర్ ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని తీసుకెళ్లే ప్రతిపాదనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి గండి పెట్టి తాగునీటి పేరిట చేపడుతున్న ఆ ప్రాజెక్టును వెంటనే ఆపాలని కృష్ణా బోర్డును డిమాండ్ చేశారు.
అసలు ఏపీ ఆ ప్రాజెక్టు కడుతున్న విషయం తెలుసా? తెలియదా? అని నిలదీశారు. బోర్డుకు కనీస సమాచారం ఇవ్వకుండా చేపడుతున్న ఆ ప్రాజెక్టుపై బోర్డు అభిప్రాయమేంటో చెప్పాలన్నారు. ‘విభజన చట్టం ప్రకారం ఆ ప్రాజెక్టును చేపడుతున్నామని ఏపీ చెబుతున్నా.. మరి, అదే విభజన చట్టంలో భాగమైన తెలంగాణకు కనీస సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదా?’ అని ప్రశ్నించారు. ఇటు తెలంగాణకుగానీ, అటు బోర్డుకుగానీ తెలియకుండా ప్రాజెక్టును చేపట్టడం అక్రమమని మండిపడ్డారు. పనులను ఎక్కడికక్కడ ఆపేయాలంటూ ఏపీకి ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు. వీలైనంత త్వరగా బోర్డు మీటింగ్‌ను నిర్వహించాలని సూచించినట్లు తెలిసింది.
సాగర్‌లో ప్రాజెక్టు అక్రమమని, ఇప్పటికే కేటాయింపులకు మించి నీటిని వాడుకుంటున్నారని ఏపీకి రాసిన లేఖలో ఈఎన్సీ స్పష్టంచేశారు. విభజనచట్టం ప్రకారం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెబుతున్నా.. కనీసం బోర్డుకు సమాచారం ఇవ్వకుండా ఎలా ప్రాజెక్టును చేపడతారని లేఖలో ఏపీని నిలదీశారు. ఓవైపు సమావేశాలంటూనే మరోవైపు ఇలా దొంగచాటుగా ప్రాజెక్టులను నిర్మించడమేంటని ప్రశ్నించారు. విభజనచట్టం ప్రకారం పనులు చేయడం కాదని.. విభజన చట్టాన్ని తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత పనులను ఎక్కడివక్కడే ఆపేయాలని డిమాండ్‌చేశారు. సాగర్ సొరంగంపై ప్రభుత్వానికి సాగర్ ప్రాజెక్ట్ అథారిటీ రిపోర్టు ఇచ్చినట్టు సమాచారం. ఏపీ చేపడుతున్న ప్రాజెక్టుపై తమకు సమాచారం లేదని ఇందులో పేర్కొన్నట్టు తెలుస్తోంది.
