కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతారాహిత్యంతో గ్రామీణ కూలీలకు సరైన న్యాయం జరగడం లేదు. దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నప్పుడు గ్రామీణ ప్రజలకు అండగా నిలవాల్సిన ఉపాధి హామీ పథకమే నిధుల సమస్యలతో నీరసించడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణ పేదలకు పని కల్పించడం ప్రభుత్వ బాధ్యత. కానీ ఆ బాధ్యతను నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల వాటా వివాదాలు అడ్డంకిగా మారడం విచారకరం.
ప్రస్తుతం ఈ పథకం స్థానంలో వికసిత్ భారత్ – రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) పేరుతో కొత్త విధానం అమలులోకి వచ్చింది. గతంలో పనికోరిన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించే విధానం ఉండగా, కొత్త పథకంలో నిధుల కేటాయింపుల ఆధారంగా పనులు చేపట్టే విధానం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. రాష్ట్రాలు తమవాటా నిధులు విడుదల చేయకపోతే కూలీలకు పనులు కల్పించడం కష్టంగా మారుతుంది.
ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. కొత్త పథకంలో ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి 125 రోజుల వేతనంతో కూడిన పని కల్పించాలనే లక్ష్యం ఉంది. గతంలో ఉన్న 100 రోజుల పరిమితిని 125 రోజులకు పెంచడం స్వాగతించదగిన పరిణామమే. కానీ పని దినాలు పెంచినంత మాత్రాన కూలీల జీవితాల్లో మార్పు రాదు. ఆ మేరకు నిధులు విడుదల చేసి, పనులు కల్పించి, చేసిన పనికి సకాలంలో వేతనాలు చెల్లించినప్పుడే పథకానికి సార్థకత ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉపాధి కోరుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
కూలి పనులే జీవనాధారం
జులైలో 1.25 కోట్లుగా ఉన్న పని కోరుతున్నవారి సంఖ్య అక్టోబర్ నాటికి 2.33 కోట్లకు చేరడం సాధారణ పరిణామం కాదు. సాధారణంగా ఈ సమయంలో వ్యవసాయ పనులు పెరిగి గ్రామీణ కూలీలకు ఉపాధి లభించాలి. కానీ కరువు పరిస్థితులు, వ్యవసాయ సంక్షోభం కారణంగా కూలీలు ప్రభుత్వ ఉపాధి పనులపై ఆధారపడాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో పథకం అమలును వేగవంతం చేయాల్సింది పోయి నిధుల సమస్యలతో పనులు మందగించడం పాలకుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ఉపాధి హామీ పనులు సక్రమంగా కొనసాగితే ఈ వలసలను కొంతవరకు అరికట్టవచ్చు. అయితే కొత్త పథకంలో రాష్ట్రాలపై 40 శాతం నిధుల భారం విధించడం ఆచరణలో సమస్యగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రాలు తమ వాటా నిధులను సకాలంలో సమకూర్చలేకపోతే నష్టపోయేది ప్రభుత్వాలు కాదు, రెక్కాడితేగానీ డొక్కాడని పేద కూలీలే.
బాధ్యులపై చర్యలు అవసరం
కేంద్రం, రాష్ట్రాల మధ్య ఆర్థిక వివాదాల కారణంగా కూలీలకు పని లేకుండా చేయడం సమర్థనీయం కాదు. మరోవైపు గతంలో ఉపాధి హామీ పథకంలో నిధుల దుర్వినియోగం, వేతనాల చెల్లింపులో జాప్యం, అసంపూర్తి పనులు వంటి సమస్యలు ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. వాటిని అరికట్టేందుకు పారదర్శక విధానాలు, సామాజిక తనిఖీలు, బాధ్యులపై చర్యలు అవసరం. కానీ అక్రమాలను అరికట్టాలనే పేరుతో నిజమైన కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గకూడదు.
అవినీతిని నియంత్రించడం ప్రభుత్వ బాధ్యతే తప్ప పేదలకు పని నిరాకరించడానికి అది కారణం కాకూడదు. ఉపాధి హామీ పథకం కేవలం ఒక సంక్షేమ కార్యక్రమం కాదు. అది గ్రామీణ పేదల జీవన భద్రతకు సంబంధించిన హక్కు. కరువు వచ్చినప్పుడు, పంటలు ఎండిపోయినప్పుడు, వ్యవసాయ పనులు నిలిచిపోయినప్పుడు ప్రజలకు అండగా నిలవాల్సింది ప్రభుత్వమే. 125 రోజులు నిజంగా పని కల్పించినప్పుడే ప్రభుత్వ హామీకి విలువ ఉంటుంది. కరువు కాటకాలతో అల్లాడుతున్న గ్రామీణ భారతానికి కావాల్సింది నిబంధనల భారం కాదు, చేతినిండా పని. సమయానికి వేతనం. గౌరవప్రదమైన జీవనం. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా తక్షణ చర్యలు తీసుకోవాలి.
- వెంకగారి భూమయ్య
జర్నలిస్ట్
