బీజేపీ, ఆర్ఎస్ఎస్ గుండెల్లో భయం, కోపం, ద్వేషం : అమ్మ, నాన్న ఒడి వ్యాఖ్యలపై రాహుల్ కౌంటర్

బీజేపీ, ఆర్ఎస్ఎస్ గుండెల్లో భయం, కోపం, ద్వేషం : అమ్మ, నాన్న ఒడి వ్యాఖ్యలపై రాహుల్ కౌంటర్
  • అందుకే వాళ్లు ప్రేమను చూపలేకపోతున్నరు
  • నిజమైన హిందువుగా ఆ ద్వేషం నుంచి 
  • వాళ్లను బయటపడేయటం నా బాధ్యత
  • నందిపై శివపార్వతుల శిల్పం ఫొటోతో ‘సత్యం శివం సుందరం’ అని 
  • ఎక్స్​ వేదికగా స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత
  • ‘అమ్మ, నాన్న ఒడి’ వ్యాఖ్యలపై ట్రోలింగ్‌‌‌‌కు రాహుల్ కౌంటర్

న్యూఢిల్లీ: తల్లిదండ్రుల అన్యోన్యతపై తాను చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్‌‌‌‌పై లోక్‌‌‌‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. ‘భయం, కోపం, ద్వేషం కలిసి బీజేపీ, ఆర్ఎస్ఎస్ మద్దతుదారుల గుండెల్లో ఓ వల అల్లాయి. అది వాళ్లను ప్రేమను అనుభవించకుండా, వ్యక్తం చేయకుండా అడ్డుకుంటోంది. 

నిజమైన హిందువుగా ఆ వల నుంచి వాళ్లను విడిపించడం నా బాధ్యత. అప్పుడే వాళ్లు కూడా తమ జీవితాల్లో ప్రేమలోని, అనుబంధంలోని అద్భుతమైన అందాన్ని, ఆనందాన్ని అనుభవించగలుగుతారు.. సత్యం శివం సుందరం’ అని మంగళవారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌‌‌‌తో పాటు నంది వాహనంపై శివపార్వతులు కలిసి కూర్చున్నట్లు ఉన్న ఓ ఆలయ శిల్పం ఫొటోను షేర్ చేశారు.

ఏం జరిగిందంటే..

సోమవారం ఢిల్లీలో జరిగిన తన తల్లి సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ ఆవిష్కరణ కార్యక్రమంలో రాహుల్ తన తల్లిదండ్రుల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘ప్రతి భోజనం వేళ పాపా కూర్చుంటే, పాపా ఒడిలో మమ్మీ కూర్చునేది’ అని చెప్పారు. ఆ మాటకు వేదికపై ఉన్న సోనియా ఇబ్బందిగా భుజాలు ఎగరేశారు. అందరి ఇండ్లలో ఇలాగే ఉంటుందని చిన్నప్పుడు అనుకునేవాణ్నని, స్నేహితుల ఇండ్లకు వెళ్లినప్పుడు వాళ్ల అమ్మానాన్న అలా కూర్చోకపోతే ‘మీ అమ్మ మీ నాన్న ఒడిలో ఎందుకు కూర్చోవడం లేదు’ అని అడిగేవాడినని రాహుల్ చెప్పారు. తండ్రి రాజీవ్ హత్య తర్వాత తల్లి జీవితం ఎలా మారిపోయిందో భావోద్వేగంతో వివరించారు.

మీమ్స్, బీజేపీ ఎద్దేవా

ఈ ‘ఒడి’ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున మీమ్స్ వెల్లువెత్తాయి. అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ రాహుల్ వీడియోను ట్యాగ్ చేస్తూ ‘ఎక్స్’లో ఎద్దేవా చేశారు. ‘సారీ మేడమ్.. మీ జీవితంలో ఇంత ప్రత్యేకమైన రోజున కూడా అతడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండలేకపోయాడు. దేశం ఈ విషయాన్ని ఎప్పుడో గుర్తించింది. మీరు కూడా ఇప్పుడు గుర్తిస్తారని ఆశిస్తున్నా. ఈ ప్రోడక్ట్‌‌‌‌ను ఎన్నిసార్లు లాంచ్, రీలాంచ్ చేసినా లాభం లేదు’ అని పోస్ట్ చేశారు. 

ఈ విమర్శలకు జవాబుగానే రాహుల్ మంగళవారం శివపార్వతుల శిల్పంతో పోస్ట్ పెట్టారు. ప్రేమ, బహుళత్వం, అందరినీ కలుపుకుపోవడం తన రాజకీయ సిద్ధాంతమని, ప్రస్తుత రాజకీయాలు విభజన, భయం, ద్వేషంతో నిండిపోయాయని రాహుల్ తరచూ విమర్శిస్తుంటారు.