- ఎమ్మెల్యేగా చెప్పినా విరాసత్ చేయలే
- రూ.15 వేలు లంచం ఇవ్వగానే పని చేసిన్రు
- రోడ్ల కాంట్రాక్టర్ల నుంచి 20 శాతం కమీషన్లు
- ఆఫీసర్ల లంచాలతోనే సర్కారుకు చెడ్డపేరు
- డబుల్ బెడ్రూం ఇండ్లకు బీఆర్ఎస్ లీడర్లు
- రూ.3 లక్షల దాకా వసూలు చేశారని కామెంట్
మేడ్చర్ల, వెలుగు: రాజకీయ నాయకుల కంటే ఆఫీసర్లే ఎక్కువ అవినీతికి పాల్పడుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం జడ్చర్ల పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన రెవెన్యూ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ కుటుంబానికి న్యాయబద్ధంగా జరగాల్సిన విరాసత్ కోసం రూ.15 వేలు లంచం తీసుకున్నారని అన్నారు. ఎమ్మెల్యే హోదాలో తాను చెప్పినా అధికారులు పట్టించుకోలేదని, లంచం తీసుకున్న తర్వాతే పని చేశారని పేర్కొన్నారు.
మాచారం గ్రామ శివారులోని అసైన్డ్ భూమిని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారని, తాను స్వయంగా గుర్తించి స్పందించినా అధికారులు పట్టించుకోలేదని అన్నారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తులు కోర్టు మెట్లెక్కడంతో సమస్య జటిలమైందని తెలిపారు. ప్రభుత్వానికి ముందుగానే డబ్బులు కట్టినప్పటికీ మట్టి తవ్వుకునే కాంట్రాక్టర్లను అధికారులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. రోడ్లు వేసే కాంట్రాక్టర్లను 20 శాతం కమిషన్ కోసం బెదిరిస్తున్నారని ఆరోపించారు.
ఈ పరిస్థితి మొత్తం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుందని అన్నారు. మూడేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జడ్చర్ల నియోజకవర్గంలో ఒక్క భూ కబ్జా కూడా జరుగలేదని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో తమ పార్టీ కార్యకర్తలు డబ్బులు తీసుకోలేదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన డబుల్ రూమ్ ఇండ్లలో ఆ పార్టీ కార్యకర్తలు లబ్ధిదారుల నుంచి ఒక్కో ఇంటికి రూ.2 నుంచి రూ.3 లక్షలు వసూలు చేసిన దాఖలాలు ఉన్నాయని ఆరోపించారు. దీనిపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
