ఇంటర్ రద్దుపై ఏకపక్ష నిర్ణయం వద్దు.. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలతో చర్చించాలి: కవిత

ఇంటర్ రద్దుపై ఏకపక్ష నిర్ణయం వద్దు.. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలతో చర్చించాలి: కవిత
  • ఇంటర్​ బోర్డు రద్దుపై టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఆధ్వర్యంలో రౌండ్​ టేబుల్ ​మీటింగ్​ 

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ బోర్డు రద్దుపై ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవద్దని, ముందుగా మేధావులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలతో చర్చించాలని తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు రద్దు–తెలంగాణ విద్యపై ప్రభావం అనే అంశంపై మంగళవారం హైదరాబాద్​లోని సోమాజిగూడ కత్రియా హోటల్‌‌‌‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ చదివిన వారు తర్వాత ప్రైవేట్‌‌‌‌లోనో, ఇతర కోర్సుల్లోనో చేరుతున్నారని, ఒకవేళ ప్రభుత్వ స్కూళ్లలో డ్రాపౌట్లు ఎక్కువ ఉంటే అది ప్రభుత్వ తప్పేనని పేర్కొన్నారు.

డ్రాపౌట్లను నివారించేందుకు గుజరాత్‌‌‌‌లో నమో లక్ష్మి పథకం ద్వారా డైరెక్ట్‌‌‌‌గా విద్యార్థుల ఖాతాల్లోకే ఏటా రూ.928 కోట్లు జమ చేస్తున్నారని, దీంతో అక్కడ డ్రాపౌట్లు 16 శాతం తగ్గాయని తెలిపారు. మన దగ్గర కూడా అలాంటి పథకం అమలు చేయాలని సూచించారు.  ఇంటర్ బోర్డు రద్దు వల్ల ప్రయోజనం ఏంటన్నది ప్రభుత్వం ఇప్పటివరకు సాధికారికంగా ప్రకటించలేదని ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి అన్నారు. పీవీ తీసుకొచ్చిన విధానం కాబట్టే  దీన్ని నామరూపం లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

ఈ అంశంపై డెడ్‌‌‌‌లైన్​ అనేది పెట్టకుండా చర్చించాలని ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ పాపిరెడ్డి అన్నారు. ఎవరితోనూ చర్చించకుండా 2027–2028లో ఇంటర్ బోర్డు రద్దు చేస్తామని చెప్పడం సరికాదన్నారు. ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకే ఇలాంటి అంశాన్ని తీసుకొచ్చారా అనే అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. పబ్లిక్ పాలసీ అంటేనే కచ్చితంగా ఎవిడెన్స్ బేస్డ్‌‌‌‌గా ఉండాలని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. ఇంటర్ బోర్డు పెట్టిన తర్వాత విద్యార్థులకు మంచి జరిగిందా, నష్టం జరిగిందా.. కొత్త విధానం తెస్తే మంచి జరుగుతుందా, నష్టం జరుగుతుందా అనేది చెప్పాలని డిమాండ్ చేశారు.