హైదరాబాద్, వెలుగు: ఆహార అలవాట్లలో వస్తున్న మార్పులతో రెడీ- టు- కుక్ ఉత్పత్తులకు దేశమంతటా ఆదరణ పెరుగుతోంది. బిజీ జీవనశైలి నేపథ్యంలో వంట సమయాన్ని తగ్గించుకునేందుకు వినియోగదారులు వీటికి మొగ్గు చూపుతున్నారని గోద్రెజ్ ఫుడ్ ట్రెండ్స్ రిపోర్ట్ తెలిపింది. రెడీ -టు -కుక్ పదార్థాలు భోజనం తయారీని సులభతరం చేస్తున్నాయి.
అందుకే వీటికి డిమాండ్ పెరుగుతోందని రిపోర్ట్ వెల్లడించింది. రెడీ -టు -కుక్ ఉత్పత్తులపై పెరుగుతున్న ఆసక్తి ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు కొత్త వ్యాపార అవకాశాలను తీసుకొస్తోంది. ఇడ్లీ, దోశ పిండితో పాటు సిద్ధంగా ఉన్న గ్రేవీలు, మసాలా మిశ్రమాలు, ప్రాంతీయ వంటకాల తయారీ పదార్థాలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
