మృగవని పార్క్ వద్ద రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు

మృగవని పార్క్ వద్ద రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు

చేవెళ్ల,  వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపాలిటీలోని మృగవని పార్క్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. చేవెళ్ల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు మృగవని పార్క్ వద్ద యూటర్న్ తీసుకుంటుండగా వెనుక వస్తున్న టిప్పర్ ఒక్కసారిగా బ్రేకులు వేసింది. దీంతో టిప్పర్ వెనుక వస్తున్న చైతన్య డీమ్డ్ యూనివర్సిటీకి చెందిన కాలేజీ బస్సు కారును ఢీకొట్టింది. ఇదే టైంలో బస్సు వెనుక వస్తున్న మరో కారు బస్సును ఢీకొనడంతో ముందు భాగం దెబ్బతింది.

ఈ వరుస ప్రమాదాల్లో కాలేజీ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులు, ఓ కాలేజీ స్టాఫ్​గాయపడ్డారు. స్థానికులు బస్సులోని విద్యార్థులను కిందకు దించారు. ఈ ప్రమాదంతో రోడ్డుపై కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. స్థానికులు చొరవ తీసుకుని ప్రమాదానికి గురైన బస్సును పక్కకు తొలగించడంతో ట్రాఫిక్ క్లియర్ అయింది.