ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ సీట్ల రొటేషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ సీట్ల రొటేషన్‌పై సుప్రీంకోర్టు కీలక  తీర్పు

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో జిల్లా పరిషత్‌లు, పంచాయతీ సమితి ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ సీట్ల రొటేషన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్ సీట్ల కేటాయింపులో ఒక నిర్దిష్ట నియోజకవర్గానికే రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేసే హక్కు ఓటరుకు లేదా అభ్యర్థికి  ఉండదని ధర్మాసనం స్పష్టం చేసింది.

జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది. సౌ. రూపాలి ఇంద్రభూషణ్ సోండే దాఖలు చేసిన అప్పీల్‌ను తిరస్కరించింది. రిజర్వేషన్ సీట్ల రొటేషన్ అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, దానిని ఒక నిర్దిష్ట పద్ధతిలోనే అమలు చేయాలని పిటిషనర్లు కోరలేరని  తెలపింది.

అయితే, పిటిషనర్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది విపిన్ సంఘీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. రిజర్వేషన్ రొటేషన్ నిబంధనలను పునఃపరిశీలించాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించేందుకు అనుమతించింది.

అసలు వివాదం ఏమిటంటే?

మహారాష్ట్ర ప్రభుత్వం 2025లో తీసుకొచ్చిన రూల్ XII ప్రకారం.. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత జరిగే సాధారణ ఎన్నికలను రిజర్వేషన్ సీట్ల రొటేషన్‌కు తొలి ఎన్నికగా పరిగణించాలి. దీనివల్ల గతంలో అమలులో ఉన్న రొటేషన్ విధానం మారిపోతుందని, అభ్యర్థులకు నష్టం కలుగుతుందని పిటిషనర్లు వాదించారు. ఈ నిబంధన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని అన్నారు. అయితే, 1961 చట్టంలోని సెక్షన్ 12కు అనుగుణంగానే కొత్త నిబంధనలు రూపొందించామని మహారాష్ట్ర ప్రభుత్వం వాదించింది.

2025 సెప్టెంబర్ 19న బాంబే హైకోర్టు నాగ్‌పూర్ ధర్మాసనం కూడా ఈ నిబంధనలను సవాలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. తాజాగా సుప్రీంకోర్టు సైతం అప్పీల్‌ను తిరస్కరించడంతో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా దాఖలైన న్యాయపోరాటానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.