RC17 Heroine: రామ్ చరణ్‌కు జోడీగా రేసులో 5గురు హీరోయిన్లు.. సుకుమార్ ప్లాన్ మామూలుగా లేదుగా!

RC17 Heroine: రామ్ చరణ్‌కు జోడీగా రేసులో 5గురు హీరోయిన్లు.. సుకుమార్ ప్లాన్ మామూలుగా లేదుగా!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడమే కాకుండా, చరణ్ కెరీర్‌లోనే ప్రత్యేక చిత్రంగా నిలిచిపోయింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ హిట్ కాంబో మరోసారి చేతులు కలపడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై తొలి క్లాప్ కొట్టారు. ఈ క్రమంలోనే సినిమాలో హీరోయిన్ సెలక్షన్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. చరణ్‌కు జోడీగా ఐదుగురు హీరోయిన్లకు సుకుమార్ లుక్ టెస్టులు, ఆడిషన్స్ నిర్వహించినట్లు సమాచారం. మరి ఆ ఐదుగురు ఎవరు? సినిమా కథ, జానర్, క్యాస్ట్ అండ్ క్రూ విశేషాలేంటో తెలుసుకుందాం.

ఐదుగురు హీరోయిన్లకు లుక్ టెస్టులు..?

RC17లో హీరోయిన్ ఎవరనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. సుకుమార్ ఐదుగురు హీరోయిన్లకు లుక్ టెస్టులు, ఆడిషన్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో శ్రీలీల, సారా అర్జున్, భాగ్యశ్రీ బోర్సే, ప్రీతి ముకుందన్, సాత్విక వీరవల్లి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరిని ఫైనల్ చేశారనే దానిపై క్లారిటీ లేదు. ఒకరినే ఎంపిక చేస్తారా? లేక కథకు అనుగుణంగా ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ట్రెండ్‌ను కాకుండా పాత్రకు సరిపోయే నటీనటుల ఎంపికకే సుకుమార్ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ వార్తలు సూచిస్తున్నాయి.

RC17 కథ ఎలా ఉండబోతోంది? 

RC17 కథ, జానర్‌పై ఇప్పటివరకు మేకర్స్ ఎలాంటి అధికారిక వివరాలు వెల్లడించలేదు. అయితే సినిమా లాంచ్ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తిని పెంచుతోంది. ఇందులో నెమలి ఈక డిజైన్‌లో రామ్ చరణ్ ముఖాన్ని చూపిస్తూ ‘You Can Imagine’ అనే ట్యాగ్‌లైన్ ఇచ్చారు. దీంతో చరణ్ శ్రీకృష్ణుడి పాత్రలో కనిపిస్తారనే ప్రచారం మొదలైంది. మరోవైపు ఇది భిన్నమైన కథాంశంతో తెరకెక్కే చిత్రమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘రంగస్థలం’లో గ్రామీణ రాజకీయాలను, ‘పుష్ప’లో ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రపంచాన్ని చూపించిన సుకుమార్.. ఈసారి ఎలాంటి కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే RC17 కథ శ్రీకృష్ణుడి నేపథ్యంలో సాగుతుందా? ఏదైనా ప్రత్యేకమైన జానర్‌లో రూపొందుతుందా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది. 

అనిరుధ్ ఎంట్రీతో మారిన కాంబినేషన్!

రామ్ చరణ్, సుకుమార్ సినిమాకు సంబంధించిన టెక్నికల్ టీమ్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ ఎంపిక కావడం ఆసక్తికర పరిణామం. ఇప్పటివరకు సుకుమార్ ఎక్కువగా దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి పనిచేశారు. ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి సినిమాలకు దేవిశ్రీ అందించిన సంగీతం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈసారి అనిరుధ్‌తో కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. మరోవైపు సినిమాటోగ్రాఫర్‌గా రత్నవేలు వ్యవహరిస్తున్నారు. గతంలో ‘రంగస్థలం’ సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించిన ఆయన.. మరోసారి సుకుమార్‌తో చేతులు కలపడం విశేషం. ఈ ముగ్గురి కలయికలో రామ్ చరణ్ సినిమా ఎలా ఉండబోతుందోనని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

ఇక షూటింగ్ విషయానికి వస్తే.. రెగ్యులర్ షూటింగ్ 2027 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటుల ఎంపికను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్. 

‘రంగస్థలం’ మ్యాజిక్‌ను మళ్లీ రిపీట్ చేస్తారా?

‘రంగస్థలం’తో బ్లాక్‌బస్టర్ అందించిన రామ్ చరణ్, సుకుమార్ మరోసారి జతకట్టడంతో RC17పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిట్టిబాబు పాత్రతో చరణ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా.. సుకుమార్ తనదైన కథనం, రత్నవేలు విజువల్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరి ఈసారి అనిరుధ్ సంగీతం, చరణ్ కొత్త లుక్, సుకుమార్ విభిన్నమైన కథనం ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాయో చూడాలి. మరోవైపు హీరోయిన్ ఎంపికపై కూడా ఆసక్తి కొనసాగుతోంది. ఐదుగురిలో ఎవరికైనా అవకాశం దక్కుతుందా? లేక సుకుమార్ మరో సర్‌ప్రైజ్ ఇస్తారా? అన్నది సస్పెన్స్ గా మారింది. మొత్తానికి RC17 అప్‌డేట్స్ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆ ఐదుగురు హీరోయిన్ల బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

1. శ్రీలీల: ‘పెళ్లిసందD’, ‘ధమాకా’, ‘భగవంత్ కేసరి’, ‘గుంటూరు కారం’ సినిమాలతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించింది. డ్యాన్స్, ఎనర్జిటిక్ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

2. సారా అర్జున్: బాలనటిగా కెరీర్ ప్రారంభించిన సారా.. ‘దైవ తిరుమగళ్’, ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలతో గుర్తింపు పొందింది. ఇటీవల ‘ధురంధర్’తో మరోసారి వార్తల్లో నిలిచింది.

3. భాగ్యశ్రీ బోర్సే: ‘మిస్టర్ బచ్చన్’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. ‘కింగ్‌డమ్’, ‘కాంత’ చిత్రాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటోంది.

4. ప్రీతి ముకుందన్: ‘ఓం భీమ్ బుష్’, ‘కన్నప్ప’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. దక్షిణాది భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటోంది.

5. సాత్విక వీరవల్లి: ఇంజినీరింగ్, మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత నటన వైపు అడుగుపెట్టిన సాత్విక.. దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’తో తెలుగు తెరకు పరిచయం కానుంది. అయితే ఈ ఐదుగురిలో RC17 హీరోయిన్‌గా ఎవరు ఎంపికవుతారనేది ఇంట్రెస్టింగ్గా మారింది.