చెన్నూరును టూరిస్ట్ స్పాట్ గా తీర్చిదిద్దుతా: మంత్రి వివేక్

చెన్నూరును టూరిస్ట్ స్పాట్ గా తీర్చిదిద్దుతా: మంత్రి వివేక్

మంచిర్యాల జిల్లా: చెన్నూరులోని పోచమ్మ ఆలయ అభివృద్ధికి రూ.2 కోట్లు కేటాయించామని, పట్టణాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి వివేక్  తెలిపారు. జైపూర్ మండలం శివ్వారం వద్ద క్రొకోడైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని, వచ్చే వారంలో చెన్నూరు బస్ డిపో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. జోడువాగుల వద్ద రూ.100 కోట్లతో రోడ్డు పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు.

చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా చెన్నూరు, కోటపల్లి మండలాలతో పాటు చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 1,253 మంది నూతన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని  మి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదల సొంతింటి కలను నెరవేరుస్తోందని అన్నారు. ఇళ్లు నిర్మించుకోవడానికి ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులకు కాంట్రాక్టర్ల ద్వారా ఇళ్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఉచిత విద్యుత్ ద్వారా ప్రతి కుటుంబానికి నెలకు రూ.1,200 ఆదా అవుతోందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు ఆర్టీసీకి రూ.12 వేల కోట్లు అందించామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని చెప్పారు. సోమనపల్లిలో రూ.250 కోట్లతో 2,500 మంది విద్యార్థులకు సరిపడే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కొనసాగుతోందన్నారు.