పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే విషయంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్‌లో 20 శాతానికి మించి ఇథనాల్ కలుపుతున్నారన్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఆరోపణలు చేస్తున్న వారికి సైన్స్ గురించి కనీస అవగాహన లేదు.. సైన్స్ తెలియని మూర్ఖులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం త్రిస్సూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. పెట్రోల్‌తో నడిచే వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇథనాల్ బ్లెండింగ్ ఒక్కటే మార్గమని అన్నారు. భారత్ ఇప్పటికే 10 శాతం ఇథనాల్ మిశ్రమం కలిగిన E10 నుంచి 20 శాతం ఇథనాల్ కలిగిన E20 పెట్రోల్‌కు మారిందని వివరించారు. ఈ మార్పు విస్తృతమైన శాస్త్రీయ పరిశోధనల అనంతరం, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) ఆమోదంతోనే జరిగిందని తెలిపారు.
పెట్రోల్‌లో అనుమతించిన పరిమితికి మించి ఇథనాల్ కలుపుతున్నారంటూ కొందరు రాజకీయంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని సురేష్ గోపి ఆరోపించారు. ఇథనాల్ శాతాన్ని ఎవరైనా పరీక్షించుకోవచ్చని, అలాంటి పరీక్షలను తాను అడ్డుకోబోనని స్పష్టం చేశారు.
20 శాతం దాటితే ఆటోమేటిక్‌గా వాల్వ్ కట్‌ఆఫ్!
పెట్రోల్ బంకులకు సరఫరా చేసే ఇంధనంలో ఇథనాల్ శాతం 20 దాటకుండా ప్రత్యేక వ్యవస్థ ఉంటుందని మంత్రి వివరించారు. ఇథనాల్ మిశ్రమ యంత్రాలను 20 శాతం వద్ద ఆటోమేటిక్‌గా ఆగిపోయేలా క్రమాంకనం (Calibration) చేశారని చెప్పారు. ఇథనాల్ శాతం 20కి చేరగానే వాల్వ్ సరఫరాను నిలిపివేస్తుందని, ఈ విధానం శాస్త్రీయంగా నిరూపితమైందన్నారు.
ఇంధనంలో కల్తీ జరిగిందా? లేదా? అన్నది తేల్చేందుకు సీబీఐ విచారణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అనుమానాస్పద పెట్రోల్ బంకుల నుంచి నమూనాలు సేకరించారా? లేదా? అనే అంశాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుందన్నారు.ఇథనాల్ బ్లెండింగ్ కారణంగా వాహనాలు దెబ్బతిన్నాయంటూ ఇప్పటివరకు బీమా క్లెయిమ్‌లు కూడా రాలేదని సురేష్ గోపి అన్నారు.
బ్రెజిల్‌లో 80-85 శాతం ఇథనాల్ ఇంధనం
బ్రెజిల్‌లో E80 లేదా E85 తరహా అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనాలను ఉపయోగిస్తున్నారని మంత్రి గుర్తుచేశారు. అయితే ఇలాంటి ఇంధనాలు పలు మిశ్రమాలకు అనుగుణంగా రూపొందించిన వాహనాల్లోనే వినియోగిస్తారని తెలిపారు.
