- ప్రభుత్వ బీమా పథకాలన్నీ ఒకే గొడుగు కిందకు
- రూ.2 లక్షల జీవిత బీమా రూ.5 లక్షలకు పెంపు
- రూ. పది లక్షల ప్రమాద బీమా యథాతథంగా ఉంచాలన్న సీఎం
- గ్రామస్థాయిలోనే దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని స్పష్టం
- అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు.. తక్షణమే జిల్లాలకు స్టాక్
- ఆర్థిక, ప్రణాళిక, సీఎంవో అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కోటి నిరుపేద కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించేలా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న బీమా పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి, అర్హులైన ప్రతి కుటుంబానికీ ఆర్థిక భద్రత కల్పించనున్నారు.
ఇప్పటికే అమల్లో ఉన్న రూ.2 లక్షల జీవిత బీమాను రూ.5 లక్షలకు పెంచడంతోపాటు, రూ.10 లక్షల ప్రమాద బీమాను యథాతథంగా కొనసాగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ పథకం దరఖాస్తు ఫారాలను ఈ నెల 19న సిద్దిపేటలో సీఎం స్వయంగా విడుదల చేయనున్నారు.
ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు
జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆర్థిక, ప్రణాళిక, సీఎంవో ఉన్నతాధికారులతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ఇందిరమ్మ చీరల పంపిణీపై సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కోటి అర్హులైన పేద కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా అందనుందని తెలిపారు.
గ్రామీణ ఉపాధి హామీ కూలీలతోపాటు రెక్కాడితే గానీ డొక్కాడని లక్షలాది పేద కుటుంబాలకు ఈ పథకం కొండంత అండగా నిలుస్తుందని చెప్పారు. ప్రస్తుతం కొన్ని శాఖల్లో జీవిత బీమా కింద రూ.2 లక్షలు, ప్రమాద బీమా కింద రూ.10 లక్షలు అందుతున్నాయని అధికారులు వివరించగా.. జీవిత బీమా మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచాలని సీఎం స్పష్టం చేశారు.
ప్రమాద బీమా మొత్తంలో ఎలాంటి మార్పు ఉండదని, ఇప్పటివరకు లబ్ధి పొందుతున్న వారిలో ఏ ఒక్కరినీ తొలగించడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ప్రజలకు దరఖాస్తుల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా గ్రామ పంచాయతీల్లోనే ఫారాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇందిరమ్మ బీమా పథకంపై పల్లెపల్లెనా విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. పథకాల అమలుపై కలెక్టర్లతో వెంటనే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కార్యాచరణ వివరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
అర్హులైన ప్రతి మహిళకు చీర
మరోవైపు అర్హులైన పేద మహిళలందరికీ పండుగ కానుకగా ఉచితంగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా ఈ నెల 19న సిద్ధిపేట బహిరంగ సభలోనే సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి మహిళకు చీర అందేలా పక్కా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గోదాముల్లో ఉన్న చీరల నిల్వలను తక్షణమే అన్ని జిల్లాల కేంద్రాలకు తరలించాలని స్పష్టం చేశారు. పంపిణీలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినా, చీరల నాణ్యతలో తేడాలున్నా సహించేది లేదని హెచ్చరించారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలయ్యేలా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీఎం మార్గనిర్దేశం చేశారు. ఈ సమీక్షలో సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, కార్యదర్శి మానిక్ రాజ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
వారం రోజుల్లోనే పరిహారం
వేర్వేరు బీమా పథకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా అన్ని పథకాలనూ సమన్వయం చేసి ఒకే విధానంలో అమలు చేయాలని సీఎం సూచించారు. దీనివల్ల క్లెయిమ్‌ల పరిష్కారంలో పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. అనుకోని ప్రమాదం లేదా విపత్తు కారణంగా కుటుంబ పెద్ద లేదా కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణిస్తే, ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడకుండా వారం రోజుల్లోనే పరిహారం అందేలా వ్యవస్థను రూపొందించాలని ఆర్థిక శాఖకు సూచించారు.
