సింగరేణి కాలరీస్, కేంద్ర ప్రభుత్వ కంపెనీల యూనియన్లతో రివ్యూ
హైదరాబాద్, వెలుగు: రాష్ర్ట ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఎస్సీ, ఎస్టీ పార్లమెంటరీ కమిటీ బుధ, గురువారాల్లో హైదరాబాద్ లోని ఓ హోటల్ లో సమావేశం కానుంది. బుధవారం రాష్ర్టంలో ఎస్సీ, ఎస్టీల సామాజిక, ఆర్థిక, విద్యాస్థితిగతులపై ఎస్టీ, ఎస్టీ శాఖలు అమలు చేస్తున్న స్కీమ్ లు, వివిధ అంశాలపై సీఎస్ సంజయ్ జాజుతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం హైదరాబాద్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన మిథాని, బీడీఎల్ కంపెనీల ఎస్టీ, ఎస్సీ సంఘాల నేతలతో కమిటీ సమావేశం కానుంది.
గురువారం సింగరేణి కాలరీస్ ఎస్సీ, ఎస్టీ సంఘాలు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ర్ట, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, పంజాబ్ సింద్ బ్యాంక్, ఎన్ ఎండీసీ సంఘాలతో భేటీకానుంది. బీజేపీ ఎంపీ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే చైర్మన్ గా ఉన్న ఈ కమిటీలో మొత్తం 30 మంది లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. కమిటీలో తెలంగాణ నుంచి ఎంపీ మల్లు రవి, ఏపీ నుంచి ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఉన్నారు. కమిటీ మొత్తం 39 అంశాలపై చర్చించనుందని ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ అధికారులు చెబుతున్నారు.
