- బాధితులంతా తెలంగాణ వాసులే
- 67 మందికి శిక్షణ.. ఒక్కరికే ఉద్యోగం
- ఫిర్యాదు చేసిన టామ్‌కామ్ జీఎం
- లక్నోకు చెందిన ఫెయిర్‌స్ట్రీట్ సంస్థపై కేసు నమోదు
బషీర్‌బాగ్, వెలుగు: విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తెలంగాణ యువతను మోసం చేసి రూ.1.28 కోట్లకు పైగా వసూలు చేసిన లక్నోకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. జర్మనీతో పాటు ఇతర దేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మించి, 67 మంది అభ్యర్థులకు శిక్షణ ఇప్పించిన ఫెయిర్‌స్ట్రీట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చివరకు ఒక్కరికే ఉద్యోగం కల్పించిందని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) ఫిర్యాదు చేసింది. ఉద్యోగాల కల్పనలో విఫలమవడమే కాకుండా, తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించకపోవడంతో సంస్థతో పాటు ఇద్దరు కీలక ప్రతినిధులు సుధాన్షు మిశ్రా, సౌరవ్ కుమార్ పాండేలపై పోలీసులు మోసం కేసు నమోదు చేశారు.
టామ్‌కామ్ జనరల్ మేనేజర్ నాగభారతి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. తెలంగాణ యువతకు జర్మనీతో పాటు ఇతర దేశాల్లో ఉద్యోగ, అప్రెంటిస్ అవకాశాలు కల్పించేందుకు 2024 సెప్టెంబర్ 13న టామ్‌కామ్, ఫెయిర్‌స్ట్రీట్ ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా అభ్యర్థులకు జర్మన్ భాషలో నైపుణ్య శిక్షణ ఇవ్వడం, విదేశీ కంపెనీలతో సమన్వయం చేసుకోవడం, ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహించడం, వీసా ప్రక్రియలో సహకరించడం, విదేశాలకు వెళ్లే వరకు అవసరమైన ఏర్పాట్లు చేయడం వంటి బాధ్యతలను ఫెయిర్‌స్ట్రీట్ తీసుకుంది.
ఈ ఒప్పందం మేరకు మూడు విడతల్లో 67 మంది అభ్యర్థులకు జర్మన్ భాషలో శిక్షణ ఇచ్చారు. వీరిలో 42 మంది బీ1 స్థాయి ధ్రువీకరణ పత్రాలు కూడా పొందారు. దీనికి గాను అభ్యర్థుల నుంచి టామ్‌కామ్ నిధులు సేకరించి, వివిధ విడతల్లో ఫెయిర్‌స్ట్రీట్‌కు రూ.1,28,19,000 చెల్లించింది. అయితే ఇంత భారీ మొత్తం ఖర్చు చేసినా, 67 మందిలో కేవలం ఒక్కరికే విదేశాల్లో ఉద్యోగం లభించిందని టామ్‌కామ్ ఆరోపించింది. మరో 11 మంది అభ్యర్థుల బీ1 ధ్రువీకరణ పత్రాల గడువు కూడా ముగిసే పరిస్థితి ఏర్పడిందని ఫిర్యాదులో పేర్కొంది.
అర్హతకు సంబంధం లేని ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు
అభ్యర్థుల విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యాలకు అనుగుణంగా ఉద్యోగాలు కల్పించాల్సి ఉండగా.. రిటైల్, సేల్స్, నిర్మాణ రంగాలకు సంబంధించిన ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశారని టామ్‌కామ్ తెలిపింది. ఇవి అభ్యర్థుల అర్హతలకు, వారు ఆశించిన ఉద్యోగాలకు సరిపోకపోవడంతో పలువురు ఇంటర్వ్యూలకు హాజరుకాలేదని పేర్కొంది. విదేశాల్లో మంచి ఉద్యోగాలు లభిస్తాయన్న ఆశతో శిక్షణ పొందిన యువత విలువైన సమయాన్ని, డబ్బును వెచ్చించినా ఆశించిన ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
