కేసీఆర్ పొలానికి ‘కొండపోచమ్మ’ నీళ్లు .. మిగతా రైతుల్లాగే ఆయన 67 ఎకరాలకూ పారుతున్నయ్: కేటీఆర్

కేసీఆర్ పొలానికి   ‘కొండపోచమ్మ’ నీళ్లు .. మిగతా రైతుల్లాగే ఆయన 67 ఎకరాలకూ పారుతున్నయ్: కేటీఆర్
  • కరువులో కొడంగల్​కు రూ.9 వేల కోట్లు ఇవ్వడమేంటి?
  • ధరలు పెరుగుతుంటే మూసీ సుందరీకరణ అవసరమా?
  • కాళేశ్వరం పేరు మారిస్తే.. 
  • మేం అధికారంలోకి వచ్చాక 
  • కాంగ్రెస్ నేతల పేర్లమీద ఉన్న ప్రాజెక్టుల పేర్లన్నీ మారుస్తం
  • చిట్ చాట్​లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, వెలుగు:కొండ పోచమ్మ సాగర్​నీళ్లు కేసీఆర్​పొలానికి పారుతున్నాయని, మిగతా రైతుల్లాగే ఆయన​67 ఎకరాలకూ నీళ్లు వెళ్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  అన్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న వేళ భారత్ సమిట్ ప్రచారానికి కోట్లు ఖర్చు పెట్టడం, కొడంగల్​కే రూ.9 వేల కోట్లు ఇవ్వడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం కేటీఆర్​ తెలంగాణభవన్​లో మీడియాతో చిట్​చాట్​ చేశారు. రైతుల్లో ప్రభుత్వంపై భారీగా వ్యతిరేకత ఉందన్నారు.

 కృష్ణా నదిలో 250 టీఎంసీల నీళ్లు ఉన్నా పంపులు ఎందుకు ఆన్ చేయడం లేదని నిలదీశారు. 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలమూరుకు నీళ్లు రావడం లేదని, ఆంధ్రాకు ఎందుకు పోతున్నాయని ప్రశ్నించారు. కరువు సాయం కేంద్రం ఇచ్చాక ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని మండిపడ్డారు. బియ్యం, కూరగాయల ధరలు పెరుగుతుంటే మూసీ సుందరీకరణ అవసరమా? అని ప్రశ్నించారు. సమ్మక్కసాగర్​ డీపీఆర్ తిరిగి రావడం అంటేనే ప్రభుత్వ పనితనం ఏంటో అర్థమవుతుందని విమర్శించారు. 

సోనియా గాంధీ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావనేది?

కాళేశ్వరం ప్రజల ప్రాజెక్టని, దాని పేరు మార్చడం అంటే సిగ్గుచేటని కేటీఆర్ అన్నారు.ప్రాజెక్టులకు ఎక్కడా కేసీఆర్ పేరు పెట్టుకోలేదని, దేవుళ్ల పేర్లే పెట్టుకున్నారని తెలిపారు. ఇప్పుడు పేరు మార్చి శునకానందం పొందుతున్నారని విమర్శిస్తూ.. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే తాము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నాయకుల పేర్ల మీద ఉన్న ప్రాజెక్టుల పేర్లు మారుస్తామని హెచ్చరించారు. సోనియా గాంధీ ఆత్మలో, గుండెలో తెలంగాణ ఉంటే ఆమె ఆత్మకథ పుస్తకంలో తెలంగాణ ప్రస్తావన ఎందుకు లేదని నిలదీశారు.

 కాంగ్రెస్ నేతలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కోట్లాది ప్రజల ఆకాంక్షలు, త్యాగాలు, కేసీఆర్ నాయకత్వంలో సాగిన ఉద్యమ ఫలితమే స్వరాష్ట్రమన్నారు. పీవీ నరసింహారావుపై ఇప్పుడు ప్రేమ ఒలకబోస్తున్న కాంగ్రెస్ నేతలకు ఆయన కుమార్తె వాణీదేవి గట్టి సమాధానం ఇచ్చారని, పీవీపై అంత ప్రేమ ఉంటే ఆయన అంత్యక్రియలను ఢిల్లీలో ఎందుకు నిర్వహించలేదని ఆమె ప్రశ్నించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం గురించి సుద్దులు చెప్పే రాహుల్.. ప్రతిపక్షాలు ప్రెస్ మీట్ పెడితే కేసులు ఎందుకు పెడుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మూడేండ్లలో జనానికి ఒరిగింది శూన్యం

ఈ మూడేండ్లలో జనానికి ఒరిగింది ఏమీ లేదని కేటీఆర్ విమర్శించారు. ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ మేనిఫెస్టో అని, నోటికి ఎంత వస్తే అంత అడ్డగోలుగా ఇచ్చిన 420 హామీలను చూస్తే చక్కెర వచ్చి పడిపోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోందని, ఎన్నికలకు ఆరు నెలల ముందు హామీలు నెరవేరిస్తే మళ్లీ గెలవొచ్చని ప్రభుత్వం భ్రమలో ఉందని అన్నారు. 

కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైజింగ్ కాదు.. ఫాలింగ్ అవుతోందని ఆరోపించారు. ఐటీ సెక్టార్​లో ఉద్యోగాలు పడిపోయాయని, హైదరాబాద్​లో రియల్ ఎస్టేట్ కుదేలైందని పేర్కొన్నారు. కమీషన్ల కోసం బిల్డర్లను బెదిరిస్తూ ‘ఆర్ఆర్ ట్యాక్స్’ వసూలు చేస్తున్నారన్నారు.