న్యూఢిల్లీ, వెలుగు: రెండు భారీ తుఫాన్ల తాకిడితో పంటలు సహా వివిధ రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, రాష్ట్రానికి తక్షణ ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇటీవల సంభవించిన వరుస తుఫాన్లు, హార్టికల్చర్ హబ్, పూర్వోదయ నిధుల విడుదల, ప్రాంతాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు వంటి కీలక అంశాలపై చర్చించారు.
ఇటీవల రాష్ట్రాన్ని తాకిన ఆర్నబ్, మురసు తుఫాన్ల వల్ల కలిగిన నష్టం వివరాలను కేంద్ర మంత్రికి చంద్రబాబు వివరించారు. ప్రాథమిక అంచనా ప్రకారమే ఈ రెండు తుఫాన్ల వల్ల సుమారు రూ.7 వేల కోట్లకుపైగా నష్టం సంభవించిందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ రైతులను ఆదుకునేందుకు పట్టిసీమ ద్వారా కొన్ని ప్రాంతాలకు సాగునీరు అందించామని, అయితే తుఫాన్ల దాటికి పంటలు వేసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, కేంద్రం తక్షణ సాయం అందిస్తే కొంతమేర ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని నిర్మలా సీతారామన్‌కు చంద్రబాబు వివరించారు.
