సోనియా గాంధీ ఆత్మకథను తెలుగులోకి అనువదిస్తాం: మాజీ మంత్రి దానం నాగేందర్

సోనియా గాంధీ ఆత్మకథను తెలుగులోకి అనువదిస్తాం: మాజీ మంత్రి దానం నాగేందర్
  • ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఫ్రీగా ఇస్తాం
  • మాజీ మంత్రి దానం నాగేందర్

సైఫాబాద్, వెలుగు: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రచించిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ ఆత్మకథను తెలుగులోకి అనువదించి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఉచితంగా అందజేస్తామని మాజీ మంత్రి దానం నాగేందర్ వెల్లడించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ఆయనతో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

హైదరాబాద్ ఆదర్శ్‌నగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఆయన మాట్లాడుతూ సోనియా గాంధీ కుటుంబం దేశానికి చేసిన సేవలు, త్యాగాలను తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆత్మకథను తెలుగులోకి అనువదించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అనువాదం పూర్తయిన తర్వాత పుస్తకాన్ని గాంధీ భవన్‌లో అందుబాటులో ఉంచడంతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలకు ఉచితంగా పంపిణీ చేస్తామని దానం నాగేందర్ వెల్లడించారు.