పెండ్లి కార్డు ఇస్తే ఇంత దిగజారుడు ప్రచారమా?..వైసీపీ నేతలది నీచబుద్ధి.. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం 

పెండ్లి కార్డు ఇస్తే ఇంత దిగజారుడు ప్రచారమా?..వైసీపీ నేతలది నీచబుద్ధి.. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం 

హైదరాబాద్, వెలుగు: తన బిడ్డ పెండ్లి కార్డు ఇచ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబును కలిస్తే దానిపైనా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటూ నీచంగా మాట్లాడుతున్నారని వాపోయారు. ‘‘ఆత్మీయంగా పిలిచే పెండ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే.. కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే! ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు? నా కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే రాజకీయ కొణమని, చెట్టపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్ధాలు వెతుకుతున్నారంటే మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో అర్థమవుతున్నది.

గతంలో తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబు నాయుడుని వైఎస్ఆర్ ఆహ్వానించారు. అంటే ఆయన కూడా చంద్రబాబుతో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా? చంద్రబాబు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే వైఎస్ఆర్ తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా? ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా?  నాకు, నా కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం.. ఇది వైసీపీ అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి నిదర్శనం’’ అని షర్మిల మండిపడ్డారు.