- విజయవంతం చేయాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పిలుపు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 26న హైదరాబాద్‌లో ‘సంవిధాన్ రక్షా మార్చ్’ నిర్వహించనున్నట్లు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి విజయవంతం చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. మంగళవారం పార్టీ ముఖ్య నేతలతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులతో పాటు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ మార్చ్‌కు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ఏఐసీసీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని తెలంగాణలో విజయవంతం చేస్తున్నందుకు పార్టీ అధిష్టానం పీసీసీని అభినందించిందని తెలిపారు. అదే స్ఫూర్తితో సంవిధాన్ రక్షా మార్చ్‌ను కూడా సక్సెస్ చేయాలని డీసీసీ అధ్యక్షులకు సూచించారు.
