సంక్షేమాన్ని విస్మరించిన బీఆర్ఎస్.. కాకా స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

సంక్షేమాన్ని విస్మరించిన బీఆర్ఎస్.. కాకా స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి, వెలుగు: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని, సంక్షేమాన్ని విస్మరించిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ లో నూతన చేయూత పింఛన్​ ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

అనంతరం మల్యాలలో రూ.10 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టనున్న రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే 47 మంది స్టూడెంట్స్ కు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగులు అందజేశారు.

కాల్వ శ్రీరాంపూర్లో ఎంపీ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో కొత్త పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురుచూసి అలసిపోయారన్నారు. పేదల సంక్షేమానికి మరిన్ని పథకాలు ప్రారంభించేందుకు సీఎం రేవంత్​రెడ్డి ఆలోచిస్తున్నారని తెలిపారు. తమ తాత కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి (కాకా) స్ఫూర్తితో గ్రామాల్లో సేవా కార్యక్రమాలను సైతం చేపడుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధిని పరుగులు పెడుతోందన్నారు. లబ్ధిదారులకు చేయూత పెన్షన్ల ప్రొసీడింగ్స్ అందజేసిన అనంతరం మాట్లాడారు.

శబరిమలైకి ప్రత్యేక రైళ్ల కోసం కృషి..
అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాముల కోసం శబరిమలై వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లను నడిపించాలని రైల్వే శాఖ జీఎంకు లేఖ రాసినట్టు ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మంగళవారం పెద్దపల్లి అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గతేడు కూడా స్పెషల్ ట్రైన్స్ కోసం తనవంతు కృషి చేసినట్టు గుర్తుకు చేశారు.