- రెండు నెలలైనానివేదిక ఇవ్వని అధికారులు
- వచ్చే నెల 7న వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఆదేశం
న్యూఢిల్లీ, వెలుగు: సెక్షన్ 22-ఏ నిషేధిత జాబితాలో ప్రైవేట్ పట్టా భూములు, ఇంటి స్థలాలను చేర్చడంపై వచ్చిన ఫిర్యాదుతో తెలంగాణ రెవెన్యూ సెక్రటరీ, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సమన్లు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని గతంలో ఆదేశించినా అధికారులు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ధరణి నుంచి భూ భారతి పోర్టల్‌కు రికార్డుల మార్పు సమయంలో ఎలాంటి నోటీసులు, విచారణ, గెజిట్ నోటిఫికేషన్ లేకుండా ప్రైవేట్ భూములను 22-ఏ జాబితాలో చేర్చారని అడ్వొకేట్ కె. రేవంత్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
దీంతో యజమానులు తమ భూములను అమ్ముకోలేక, రిజిస్ట్రేషన్, తనఖా చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దీనిపై సెప్టెంబర్‌లోనే స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. నిషేధిత జాబితాలోని భూముల వివరాలు, వాటిని చేర్చిన ఉత్తర్వులు, యజమానులకు నోటీసులు ఇచ్చారా లేదా అనే అంశాలపై నివేదిక కోరింది. రెండు నెలలైనా సమాధానం రాకపోవడంతో వచ్చే నెల 7న మధ్యాహ్నం 2 గంటలకు పూర్తి వివరాలతో హాజరుకావాలని అధికారులను ఆదేశించింది. వారం ముందే నివేదిక సమర్పిస్తే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తామని తెలిపింది.
