భద్రాచలం, వెలుగు: భద్రాచలం రామాలయం సమీపంలో గది అద్దె విషయంలో తలెత్తిన వివాదం ఓ ఆదివాసీ యువకుడి ప్రాణాలు బలిగొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రికొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామానికి చెందిన తెల్లం శరత్ (24) భద్రాచలంలో స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.
సోమవారం రాత్రి శరత్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి రామాలయం సమీపంలోని శ్రీ సత్యసాయి రెసిడెన్సీకి గది అద్దెకు తీసుకోవడానికి వెళ్లాడు. ఈ క్రమంలో లాడ్జీ సిబ్బంది మణికంఠ, బర్ల సాయి ఆధార్, రేషన్ కార్డు వంటి గుర్తింపు పత్రాలు అడగడంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వివాదం నేపథ్యంలో మణికంఠ శరత్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శరత్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
నిందితులు మణికంఠ, లాడ్జీ సిబ్బంది, మృతుడి మిత్రుల సహాయంతో శరత్‌ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, ఈ హత్యను కప్పిపుచ్చేందుకు నిందితులు యాక్సిడెంట్ జరిగిందంటూ తప్పుడు సమాచారం ఇచ్చి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. సమాచారం అందుకున్న భద్రాచలం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి తెల్లం రవి ఫిర్యాదు మేరకు భద్రాచలం సీఐ సట్ల రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆదివాసీ సంఘాల ఆందోళన.. లాడ్జీ సీజ్
తెల్లం శరత్ హత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శ్రీ సత్యసాయి రెసిడెన్సీ ఎదుట ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. బాధితు కుటుంబానికి న్యాయం చేయాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న తహశీల్దార్ రవికుమార్, సీఐ సట్ల రాజు, సర్పంచ్ పూనెం కృష్ణ, ఈవో శ్రీనివాస్ అక్కడకు చేరుకొని శ్రీ సత్యసాయి రెసిడెన్సీని సీజ్ చేశారు.
