- 429తో కలిపి మరో 53 పోస్టుల భర్తీకి సర్కారుకు లేఖ
- టీయూలో 37, ఎంజీయూలో 16 పోస్టులకు ఇప్పటికే అనుమతి
- జేఎన్టీయూలో 100, అంబేద్కర్ వర్సిటీలో 4 కొత్త పోస్టులకు ప్రతిపాదనలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ సంఖ్య మరింత పెరగనుంది. తాజాగా రెగ్యులర్ కేటగిరీలో భర్తీ చేయనున్న 429 పోస్టులతో కలిపి.. ఇప్పటికే అనుమతి ఉన్న మరో 53 పోస్టులను కూడా నింపేందుకు అవకాశం ఇవ్వాలని విద్యాశాఖ సర్కారుకు లేఖ రాసింది. దీనిపై ప్రభుత్వం దాదాపు ఓకే చెప్పే అవకాశం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో 37 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 16 పోస్టులకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది.
తెలంగాణ యూనివర్సిటీలో మంజూరైన 37 పోస్టులు ఇంజినీరింగ్ కాలేజీల్లోనివి కాగా.. ఎంజీయూలో ఉన్న 16 పోస్టులు ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించినవని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం భర్తీ చేయనున్న 429 రెగ్యులర్ పోస్టులతో కలిపి ఈ 53 పోస్టులను కూడా భర్తీ చేసుకునేలా అనుమతించాలని విద్యాశాఖ కోరింది. మరోవైపు, కొత్త పోస్టుల మంజూరు కోసం రెండు యూనివర్సిటీలు కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి. జేఎన్టీయూలో మరో 100, అంబేద్కర్ వర్సిటీలో 4 కొత్త పోస్టులకు అనుమతి ఇవ్వాలని కోరాయి.
వీసీలతో టీజీసీహెచ్ఈ చైర్మన్ భేటీ..
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ నేపథ్యంలో యూనివర్సిటీల వీసీలతో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయా పోస్టుల భర్తీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ క్రమంలో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల వివరాలను కూడా ఇవ్వాలని వీసీలకు చైర్మన్ సూచించారు. త్వరలోనే ఆయా పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్, ఓయూ వీసీ కుమార్, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
