భారత్ సమిట్ కాకుంటే ఫార్మ్ హౌస్ సమిట్ పెట్టాలా?: మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి

భారత్ సమిట్ కాకుంటే ఫార్మ్ హౌస్ సమిట్ పెట్టాలా?: మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి

సత్తుపల్లి, వెలుగు: హైదరాబాద్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేందుకు చేపట్టిన కార్యక్రమాన్ని కూడా విమర్శిస్తున్నారని, భారత్ సమిట్ కాకుంటే ఫార్మ్ హౌస్ సమిట్ పెట్టాలా? అంటూ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఖమ్మం జిల్లా వేంసూరు, సత్తుపల్లిలో కొత్తగా మంజూరైన పింఛన్​ పత్రాలను స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి, ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డితో కలిసి ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ దొరల పాలనలో ప్రజల సొమ్మును తమ గొప్పల కోసం పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఖర్చు చేసి, ఇప్పుడు భారత్ సమిట్ కు ప్రజాధనం వృథా చేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. రాత్రికి రాత్రే ఏపీకి చెందిన బీజేపీ నాయకుడు సీఎం రమేశ్​ను కలిసి కేసులు మాఫీ చేయాలని తండ్రికొడుకులు అడగడం ఎవరికి తెలియదనుకుంటున్నారని కేసీఆర్, కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఉద్దేశించి విమర్శించారు.

గత ప్రభుత్వంలో పల్లీలు అమ్మినట్లు ప్రశ్నాపత్రాలు అమ్ముకున్నారని, పదవులు పోయాక ఇప్పుడు విషం కక్కుతున్నారని ధ్వజమెత్తారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే తాము అప్పులకు వడ్డీలు కడుతూనే సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. అప్పటి ప్రభుత్వంలో పంపిణీ చేసిన బతుకమ్మ చీరలను పొలాల్లో పశువులు, అడవి పందులు రాకుండా అడ్డుగా కట్టేవారని, ఇప్పుడు ఇస్తున్న చీరలు చూసి ఆడబిడ్డలు మురిసిపోతున్నారన్నారు. మిగిలిన రెండు గ్యారెంటీలను కూడా పూర్తి చేసి ఎన్నికల్లో ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతామన్నారు.