- భవిష్యత్తులో రూ.2 వేల కోట్ల నిధుల సాధనే లక్ష్యం
- డిసెంబర్11 నుంచి 22 వరకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్
- ఒక్కో వేదికను ప్రముఖ అథ్లెట్లకు దత్తత.. రూ.203.36 కోట్లతో శాశ్వత వసతులు
- సెక్రటేరియెట్‌లో ప్రముఖ క్రీడాకారులతో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్ది అంతర్జాతీయ క్రీడా పటంలో అగ్రస్థానంలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సెక్రటేరియెట్‌లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026, ఇన్వెస్ట్ తెలంగాణ సన్నాహాకాలపై ప్రముఖ క్రీడాకారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.
ఈ భేటీలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్, ఎండీ సోనిబాలాదేవితో పాటు ప్రముఖ క్రీడా దిగ్గజాలు నిఖత్ జరీన్, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా, అంబటి రాయుడు, ఈషా సింగ్, జె.జె. శోభ, ఇస్మాయిల్ బేగ్, అగసర నందిని, కల్నల్ నచ్ఛతర్ సింగ్ జోహల్, బోరియా మజుందార్, నీతా దాడ్వే పాల్గొన్నారు.
20 ఏండ్ల అవసరాలకు తగ్గట్టు స్టేడియాల అభివృద్ధి
ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. గత ఏడు ఎడిషన్ల కంటే అద్భుతంగా ఎనిమిదో ఎడిషన్ ఖేలో ఇండియా క్రీడలను నిర్వహించి తెలంగాణ సత్తా చాటుతామని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.203.36 కోట్లు మంజూరు చేసిందని, ఈ నిధులతో కేవలం తాత్కాలిక ఏర్పాట్లు కాకుండా 2002–03లో చంద్రబాబు హయాంలో నిర్మించిన తరహాలోనే రాబోయే 15 నుంచి 20 ఏళ్ల భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియం సహా అన్ని వేదికలను అంతర్జాతీయ ప్రమాణాలతో శాశ్వతంగా అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ ద్వారా కేవలం ప్రభుత్వ నిధులపైనే కాకుండా స్పోర్ట్స్ సైన్స్, అకాడమీలు, స్టేడియాల నిర్మాణంలోకి భారీ ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించి ఒలింపిక్స్ పతకాలు సాధించే క్రీడాకారులను రాష్ట్రం నుంచే తయారు చేస్తామని పేర్కొన్నారు.
స్పోర్ట్స్ కోటా డిప్యూటీ కలెక్టర్లకు నోడల్ బాధ్యతలు
నిర్వహణలో ప్రతి క్రీడాకారుడి భాగస్వామ్యం ఉండాలని, ఒక్కో ప్రముఖ క్రీడాకారుడికి ఒక్కో వేదిక దత్తత బాధ్యతను అప్పగిస్తూనే, స్పోర్ట్స్ కోటా ద్వారా శిక్షణలో ఉన్న డిప్యూటీ కలెక్టర్లను నోడల్ అధికారులుగా నియమిస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. క్రీడాకారుల సలహాల కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశామని, తాను స్వయంగా పనులను రాత్రింబవళ్లు పర్యవేక్షిస్తున్నానని, నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాలు, గురుకులాలు, ప్రభుత్వ బడుల్లోని 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే వేలాది మంది విద్యార్థులను ప్రత్యేక బస్సుల్లో క్రీడా మైదానాలకు రప్పించి లైవ్‌లో ఆటలు చూపిస్తూ వారిలో క్రీడా స్ఫూర్తిని రగిలిస్తామని వివరించారు.
ఈ ఏడాది క్రీడారంగానికి ప్రభుత్వం రూ.600 కోట్లకుపైగా బడ్జెట్ కేటాయించిందని, ఖేలో ఇండియా క్రీడలను విజయవంతం చేయడం ద్వారా భవిష్యత్తులో రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు నిధులు సాధించి రాష్ట్రంలో నిరంతర క్రీడా సంస్కృతిని పెంచుతామని మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా క్రీడా పండుగ వాతావరణం నెలకొల్పుతామని, దేశంలోని 28 రాష్ట్రాల నుంచి తరలివచ్చే 7 నుంచి 8 వేల మంది క్రీడాకారులు, కోచ్‌లకు అత్యుత్తమ ఆతిథ్యం, వసతులు కల్పిస్తామని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో జరిగే పోటీల ఏర్పాట్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను సక్సెస్ చేయాలి
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ క్రీడా పోటీలను అందరి భాగస్వామ్యంతో సక్సెస్ చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ ఇండోర్ స్టేడియాన్ని ఆయన సందర్శించి, అక్కడ క్రీడల నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం స్టేడియం ఆవరణలో ఖేలో ఇండియా 8వ ఎడిషన్ సెల్ఫీ పాయింట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ, పట్టుదలతో 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించే సువర్ణావకాశం తెలంగాణకు దక్కిందని తెలిపారు. దేశంలోని 29 రాష్ట్రాల నుంచి సుమారు 8 వేల మంది క్రీడాకారులు, 1,500 మంది కోచ్‌లు పాల్గొననుండటంతో పాలమూరు ప్రాంతంలో క్రీడా పండుగ వాతావరణం నెలకొననుందని పేర్కొన్నారు.
హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా తొలిసారిగా ఐదు క్రీడాంశాలను వివిధ జిల్లాలకు కేటాయించగా, మహబూబ్‌నగర్‌కు కబడ్డీ పోటీలు దక్కడం గర్వకారణమన్నారు. ఈ క్రీడా వేడుకను విజయవంతం చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారు జితేందర్ రెడ్డి మాట్లాడుతూ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లా క్రీడలకు కేంద్రంగా నిలుస్తోందని, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణను అందరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు.
