శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో లష్కర్-ఎ-తైబా కమాండర్ మహమ్మద్ లతీఫ్ భట్ భద్రతా దళాల ట్రాప్‌లో చిక్కుకున్నాడు. మసీదులో దాక్కున్న లతీఫ్ భట్‌ను సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు రౌండర్ చేశారు. వీడియో కాల్ ద్వారా లతీఫ్ భట్‌ను లొంగిపోవాలని భద్రతా దళాలు సూచించాయి. అయితే, అతను లొంగిపోవడానికి నిరాకరించడంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.
2026, నవంబర్ 11న కుల్గామ్ జిల్లాలోని మీర్ బజార్ దగ్గర ఉన్న సీఆర్‌పీఎఫ్ చెక్‌పోస్టుపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. టూవీలర్‌పై వచ్చిన ముష్కరులు జవాన్లపై కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఈ దాడి వెనక లష్కరే కమాండర్ లతీఫ్ భట్ ప్రమేయం ఉన్నట్లు సైన్యం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే కుల్గాం జిల్లాలో ఉగ్రవాదుల ఏరివేతకు భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
కుల్గాంలో లతీఫ్ భట్ ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది సైన్యం. ఈ క్రమంలో మంగళవారం (నవంబర్ 17) లతీఫ్ భట్, అతని అనుచరుడు లారూ ప్రాంతంలో సైన్యానికి తారసపడ్డారు. ఇరువర్గాల మధ్య భీకరంగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో లతీఫ్ అనుచరుడు ఉమర్ నిసార్ దార్ హతమవగా.. గాయపడిన లతీఫ్ భట్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
సైన్యం అతడి కోసం విసృతంగా గాలింపు చర్యలు చేపట్టింది. మంగళవారం (నవంబర్ 17) అర్ధరాత్రి కుల్గామ్ జిల్లాలోని జంగల్‌పోరా ప్రాంతంలో ఒక మసీదులో లతీఫ్ భట్ దాక్కున్నట్లు సమాచారం అందుకున్న సీఆర్‌పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసుల ప్రత్యేక బృందాలు అతన్ని చుట్టుముట్టాయి.
ఈ క్రమంలో అధికారులు అతనికి వీడియో కాల్ చేసి మేము మీతో ఉన్నాం, ఎలాంటి హాని చేయం, ఆయుధాలు విడిచిపెట్టి బయటకు రండి అని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. భద్రతా బలగాల విజ్ఞప్తిని లతీఫ్ భట్ తిరస్కరించాడు. నేను అల్లాను కలవాలనుకుంటున్నాను. అల్లా తప్ప నా పక్కన ఎవరూ లేరు అని సమాధానమిచ్చాడు. లతీఫ్ భట్ సరెండర్ అయ్యేందుకు నిరాకరించడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయి.
