గూడూరు, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఏజెన్సీ గ్రామాల అభివృద్దికి పెద్దపీట వేస్తోందని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రం నుంచి నెక్కొండ, కేసముద్రం మండలాల వరకు సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‌తో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులు, బ్రిడ్జి నిర్మాణాలకు ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళీ నాయక్‌లతో కలిసి ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన గూడూరు మండలంలో రూ.9 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు నాణ్యమైన విద్యనందించడంతో పాటు, బీసీ రైతులకు త్వరలోనే ప్రభుత్వ తరఫున పట్టాలు అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్నేహ శబరీష, తహసీల్దార్ నాగభవాణి పాల్గొన్నారు.
