మంచిర్యాల జిల్లా: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అల్పాహార (బ్రేక్ఫాస్ట్) పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. బుధవారం (నవంబర్ 18) కోటపల్లి మండలంలోని మోడల్ స్కూల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అల్పాహార పథకాన్ని మంత్రి వివేక్ ప్రారంభించారు.
అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన మంత్రి.. ఆహార నాణ్యత, మెనూ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం పూట ఆకలితో పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, విద్యార్థుల హాజరు శాతం పెరగడంతో పాటు చదువుపై ఏకాగ్రత కూడా మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
2009లో తాను ఎంపీగా ఉన్న సమయంలోనే ఈ మోడల్ స్కూళ్ల ఏర్పాటు జరిగిందని గుర్తుచేశారు. విద్యార్థులందరూ బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకోవాలని సూచించారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తే వారికి బహుమతులు అందజేస్తానని ప్రకటించారు.
మోడల్ స్కూల్లో విద్యార్థుల సౌకర్యార్థం డైనింగ్ హాల్ నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. చెన్నూరు నియోజకవర్గంలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. చెన్నూరు మండలంలోని సోమనపల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలోనే విద్యార్థుల కోసం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఏటీసీ (ATC) కేంద్రాలను ఏర్పాటు చేసి యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న అల్పాహార పథకాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని, కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు.
