మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్.. తలపై 15 లక్షల రివార్డ్.. ఎన్ కౌంటర్లో హతం

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్.. తలపై 15 లక్షల రివార్డ్.. ఎన్ కౌంటర్లో హతం

కుల్గామ్: జమ్మూ కాశ్మీర్లోని కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్ లతీఫ్ భట్ హతమయ్యాడు. జమ్మూకాశ్మీర్ పోలీసులు, భద్రతా దళాలు సంయుక్త ఆపరేషన్లో ఈ ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు చేపట్టిన గాలింపు చర్యలు చేపట్టారు. లష్కరే తోయిబా (LeT) కమాండర్ లతీఫ్ భట్‌ను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో అతడి సహచరుడు ఉమర్ నిసార్ దార్ హతమవగా, తప్పించుకున్న లతీఫ్ భట్ కోసం మంగళవారం నుంచి గాలింపు కొనసాగుతోంది.

బుధవారం తెల్లవారుజామున కుల్గామ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ ప్రారంభమైనట్లు పోలీసులు ధ్రువీకరించారు. లతీఫ్ భట్ మసీదు పరిసరాల్లో చిక్కుకుని లొంగిపోవడానికి నిరాకరించాడు. దీంతో భద్రతా బలగాలు అతనిపై కాల్పులు జరిపాయి. జూలై 22న అనంతనాగ్‌లో పోలీసులపై జరిగిన దాడిలో పోలీసు సిబ్బంది మరణించిన ఘటనలో లతీఫ్కు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆగస్టు 1న కుల్గామ్‌లో ఇద్దరు వలస కార్మికుల హత్యకు కూడా అతడే కారణమై ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

సోమవారం కుల్గామ్‌లోని లారూ బైపాస్ ప్రాంతంలో భద్రతా బలగాలకు ఉమర్ నిసార్ దార్, లతీఫ్ భట్ కదలికలపై సమాచారం అందింది. పోలీసులు, సైన్యం, ఇతర భద్రతా సిబ్బంది సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఎదురుకాల్పులు జరగ్గా ఉమర్ నిసార్ దార్ హతమయ్యాడు. ఉమర్ నిసార్ దార్ వయసు 19 సంవత్సరాలు.

కుల్గామ్‌లోని అర్హే గ్రామానికి చెందిన వ్యక్తిగా భద్రతా బలగాలు గుర్తించాయి. రొట్టెలు తయారు చేసే పని చేసేవాడిగా తెలిసింది. ఉమర్ కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో ఉమర్ గత ఐదు నుంచి ఆరు నెలలుగా లతీఫ్ భట్‌కు ఆశ్రయం కల్పించడంతో పాటు ఇతర సహాయ సహకారాలు అందించినట్లు అధికారులు గుర్తించారు. నవంబర్ 11 దాడి అనంతరం అతడు ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్‌లో చేరినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి.