రూల్స్ అంటే పట్టించుకోరు.. అదే మూఢ నమ్మకం అయితే.. ఇంటర్నెట్ ను ఊపేస్తున్న యువకుడి ఆలోచన..!

రూల్స్ అంటే పట్టించుకోరు.. అదే మూఢ నమ్మకం అయితే.. ఇంటర్నెట్ ను ఊపేస్తున్న యువకుడి ఆలోచన..!

మన దేశంలో మూఢ నమ్మకాలకు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. ప్రపంచం AI సాంకేతికతతో శరవేగంగా పరుగులు తీస్తున్నా గ్రామీణ భారతంలోని చాలా ఊళ్లలో ఇప్పటికీ మూఢ నమ్మకాలు పాతుకుపోయాయి. ఊళ్లలోనే కాదు బాణామతి, చేతబడుల పేరు వింటేనే సిటీ జనాలకు కూడా టెర్రర్. రోడ్డు మీద నిమ్మకాయలు, ఎండు మిరపకాయలు, పసుపు, కుంకుమ.. ఇలాంటివి కనిపిస్తే ఆ ఛాయలకు కూడా ఎవరూ పోరు. ఈ మూఢ నమ్మకాలే.. రోడ్డు డివైడర్‌ దగ్గర ఉన్న గ్యాప్ నుంచి జనాలు పదే పదే దాటిపోతుంటే చికాకుపడిన ఒక యువకుడి వినూత్న ఆలోచనకు కారణం అయ్యాయి.

పబ్లిక్కు పద్ధతిగా చెప్తే వినడం లేదు. అలా అని.. బ్యారికేడ్ పెట్టలేదు. బోర్డు రాయలేదు. బదులుగా అక్కడ సింధూర్ పళ్లెం పెట్టాడు. అంతే, జనాలు ఆగిపోయారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో 21 లక్షలకు పైగా వ్యూస్ దాటింది. ఆ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో మొత్తం ఎక్స్‌పెరిమెంట్ కనిపిస్తుంది.

డివైడర్‌లో ఉన్న గ్యాప్ దగ్గర రోడ్డుపై ఎర్రటి కుంకుమతో గుండ్రటి గీతలు గీసి, పక్కన కుంకుమ నిండిన చిన్న పళ్లెం పెట్టాడు. చూసేందుకు అది ఒక పూజా సెటప్‌లా కనిపించింది. ఆ తర్వాత జరిగింది ఆశ్చర్యంగా అనిపించింది. ఒక వ్యక్తి గ్యాప్ దగ్గరకు వెళ్లి, పూజ జరిగిందని భావించి వెనక్కి తిరిగి వేరే దారిన వెళ్లిపోయాడు. చిన్న పాపను తీసుకొని వస్తున్న తండ్రి కూడా ఆ దారి వదిలి వేరే వైపు నడిచాడు. కుంకుమ, నిమ్మకాయ, నూనె దీపాలు వంటివి కొన్ని ఆచారాలతో ముడిపడి ఉంటాయి. పొరపాటున అటువంటివి తొక్కితే అపశకునమని చాలామంది నమ్ముతారు. ఆ మూఢ నమ్మకాన్నే ఈ యువకుడు తెలివిగా వాడుకున్నాడు. ఈ వీడియోపై వచ్చిన కామెంట్లు ఫన్నీగా ఉన్నాయి. కామెంట్లపై సరదాగా మీరూ ఓ లుక్కేయండి..

* ‘‘Indians ని rules follow చేయించే ఒకే ఒక్క మార్గం ఇదే’’ అని ఒకరు రాశారు.

* ‘‘Indian problem కి Indian solution మాత్రమే పనిచేస్తుంది’’ అని మరొకరు పేర్కొన్నారు.

* ‘‘Indian Muslims, Christians’’ కూడా అక్కడ నుంచి దాటరు’’ అని ఇంకొకరు జోక్ చేశారు.

* ‘‘Barrier ఆపలేకపోయింది.. అంధవిశ్వాసం ఆపింది’’ అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు.