దొంగతనం కేసు సాల్వ్ చేస్తానా: బాబా దగ్గరకు వెళ్లిన పోలీస్ అధికారి

దొంగతనం కేసు సాల్వ్ చేస్తానా: బాబా దగ్గరకు వెళ్లిన పోలీస్ అధికారి

ఎవరికైనా కష్టం వచ్చినా.. మన దగ్గర దొంగతనం జరిగినా.. హత్య జరిగినా.. అత్యాచారం అయినా.. మొదటగా వెళ్లేది పోలీసుల దగ్గరకే కదా.. రాజ్యాంగం ప్రకారం పోలీసులను నియమించింది అందుకే కదా.. అలాంటి పోలీస్ ఆఫీసర్.. ఓ దొంగతనం కేసులో దొంగలు దొరుకుతారా లేదా అని.. ఆ పోలీస్ ఆఫీసర్ బాబా దగ్గరకు వెళితే.. వినటానికే ఆశ్చర్యంగా.. వింతగా ఉందా..అవును.. అక్షరాల ఓ పోలీస్ అధికారి.. ఓ దొంగతనం కేసు విషయంలో బాబా సలహా కోరాడు.. కేసు పరిష్కారం అవుతుందా లేదా బాబా కాళ్లు మొక్కి మరీ ఆశీర్వాదం తీసుకున్నాడు.. ఇంటర్నెట్ సంచలనంగా మారిన ఈ ఇన్సిడెంట్‎కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ తన అత్తగారింట్లో జరిగిన దొంగతనం కేసు పరిష్కరించలేక యూనిఫాంలోనే పర్చీ వాలే బాబాగా పేర్కొందిన స్వామిజీని ఆశ్రయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ఆ వీడియో ప్రకారం.. వేదికపై ఆసీనుడైన బాబా ముందు సబ్-ఇన్స్పెక్టర్ నేలపై కూర్చున్నాడు. ప్రజలకు ధైర్యంగా ఉండాల్సిన పోలీస్ అధికారి అయిన మీరే నా దగ్గరకు ఎందుకు వచ్చారని బాబా ప్రశ్నించాడు. 

తన మేనత్త ఇంట్లో సుమారు ఐదు నెలల క్రితం దొంగతనం జరిగిందని, పోలీసు శాఖ తరఫున ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటివరకు ఎటువంటి ఆధారం లభించలేదని సదరు సబ్-ఇన్‌స్పెక్టర్ తన గోడు వెళ్లబోసుకున్నాడు. చోరీ జరిగింది మీ అత్తగారింట్లో.. మీ పరిధిలో లేని ఇంటి విషయంలో మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని సబ్-ఇన్‌స్పెక్టర్‎ను బాబా నిలదీశాడు. అనంతరం ఒక చీటీ రాసి ఈ దొంగతనంలో ముగ్గురు వ్యక్తుల ప్రమేయం ఉందని, త్వరలోనే నిందితులు పట్టుబడతారని బాబా పేర్కొన్నారు. దీంతో సబ్ ఇన్స్పెక్టర్ బాబా పాదాలకు నమస్కరించి వెళ్లిపోయాడు. 

ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. పలువురు నెటిజన్లు సదరు సబ్ ఇన్స్పెక్టర్ తీరును తప్పుబట్టారు. విచారణ జరుగుతోన్న క్రిమినల్ కేసు వివరాలు బహిరంగ సమావేశంలో చెప్పడం ఏంటని ప్రశ్నించారు. పోలీస్ అధికారి యూనిఫాంలో ఒక ఆధ్యాత్మిక వేదికపై కూర్చోవడం పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని కొందరు అభిప్రాయపడ్డారు. 

వ్యక్తిగత ఆధ్యాత్మిక నమ్మకాలు వేర్వేరుగా ఉంటాయని అంగీకరిస్తూనే.. నడుస్తున్న కేసు దర్యాప్తు వివరాలు అనధికారిక వ్యక్తులకు వెల్లడించడం డిపార్ట్‌మెంటల్ నిర్వహణ నిబంధనలపై ప్రశ్నలు లేవనెత్తుతుందని పలువురు పేర్కొన్నారు. ఒక పోలీస్ అధికారి శాస్త్రీయ దర్యాప్తుపై కాకుండా ఇలాంటి నమ్మకాలపై ఆధారపడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సదరు పోలీస్ ఆఫీసర్‎పై యాక్షన్ తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. ఈ ఘటనపై యూపీ పోలీస్ శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలీ.