AI చిప్స్ పోటీలో వెనుకబడిన ఇంటెల్.. మరోసారి ఉద్యోగుల తొలగింపు!

AI చిప్స్ పోటీలో వెనుకబడిన ఇంటెల్.. మరోసారి ఉద్యోగుల తొలగింపు!

సెమీకండక్టర్ దిగ్గజం 'ఇంటెల్' మరోసారి ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. కంపెనీ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా సీఈఓ లిప్-బు టాన్ మరో విడత లేఆఫ్స్‌కు ప్లాన్ చేశారు. గ్లోబల్ ఐటీ వర్క్‌ఫోర్స్‌ను లక్ష్యంగా చేసుకుని సాగిన ఈ తాజాతొలగింపుల్లో కొందరు ఉద్యోగులు జాబ్స్ లాస్ అయ్యారు.

తాజా తొలగింపుల్లో ఎఫెక్ట్ అయిన ఉద్యోగుల సంఖ్య ఎంత? ఏయే టీమ్స్, డిపార్ట్మెంట్స్ దీనికి గురయ్యాయి? అనే వివరాలను మాత్రం ఇంటెల్ ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. కేవలం తమ వ్యాపార లక్ష్యాలకు తగినట్లుగా వనరులను సరిదిద్దేందుకే లేఆఫ్స్ చేపట్టినట్లు ఇంటెల్ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. 

పెరుగుతున్న పోటీ, AI చిప్ మార్కెట్‌లో సవాళ్లు, గతంలో ఎదురైన తయారీ లోపాల నుంచి బయటపడేందుకు ఇంటెల్ ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఆపరేటింగ్ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు.. ఆఫీసులను క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా తొలగింపుల కార్యక్రమం కొనసాగుతోంది. 

గత 2 సంవత్సరాలుగా ఇంటెల్ నిరంతరం లేఆఫ్స్‌ను ప్రకటిస్తూనే ఉంది. 2025 జూలైలో ఏకంగా 24వేల ఉద్యోగాల తొలగింపును ప్లాన్ చేసిన కంపెనీ, అమెరికాలో 5వేల మందికి పైగా సిబ్బందిని తొలగించింది. అలాగే 2026 జూలైలో డేటా సెంటర్ గ్రూప్ లోనూ లేఆఫ్స్ జరిగాయి. గ్లోబల్ సెమీకండక్టర్ మార్కెట్‌లో తన సత్తాను నిరూపించుకోవడానికి ఇంటెల్ చేస్తున్న పనులు టెక్కీలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.