ఇరుముడి సూపర్ సక్సెస్: అయ్యప్ప మాల ధరించిన డైరెక్టర్ శివ నిర్వాణ, నిర్మాత మైత్రీ రవి

ఇరుముడి సూపర్ సక్సెస్: అయ్యప్ప మాల ధరించిన డైరెక్టర్ శివ నిర్వాణ, నిర్మాత మైత్రీ రవి

టాలీవుడ్‌లో ఓ సినిమా సృష్టించిన ప్రభంజనం ఎంతటిదో చెప్పడానికి ఇదొక ఆసక్తికరమైన ఉదాహరణ.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించడమే కాదు.. ప్రేక్షకుల మనసుల్లోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’ సినిమా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమా సాధించిన ఘన విజయంతో ఆధ్యాత్మిక బాట పట్టారు చిత్ర దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాత వై. రవిశంకర్.

‘ఇరుముడి’తో ప్రేక్షకులను అయ్యప్ప భక్తి భావంలో ముంచెత్తిన ఈ ఇద్దరూ.. తాజాగా స్వామివారి దీక్షను చేపట్టారు. బుధవారం నవంబర్ 18న హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ దైవ సన్నిధానంలో శివ నిర్వాణ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత వై. రవిశంకర్ అయ్యప్ప మాల ధరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా భారీ సక్సెస్ తర్వాత స్వామివారిపై తమ భక్తిని చాటుకుంటూ దీక్ష చేపట్టడం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

స్వామివారి ఆశీస్సులతో మరో ప్రయాణం..

సినిమాలో అయ్యప్ప భక్తి భావాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాత రవిశంకర్ ఇప్పుడు నిజ జీవితంలోనూ అయ్యప్ప దీక్ష చేపట్టడం విశేషంగా మారింది. ఒక సినిమా విజయంతో మొదలైన ఈ ప్రత్యేక సందర్భం.. ఇప్పుడు ఆధ్యాత్మిక అనుభూతిగా మారింది. ఈ వార్తతో ‘ఇరుముడి’ అభిమానులు, అయ్యప్ప భక్తులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

►ALSO READ | గ్రామీ నామినేషన్లలో ధురంధర్‌‌ 2‌‌కు షాక్

మరోవైపు డైరెక్టర్ శివ నిర్వాణ.. తన నెక్స్ట్ సినిమాను నందమూరి బాలకృష్ణతో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే బాలయ్యకు ఓ స్టోరీ వినిపించగా ఆయనకు నచ్చినట్లు ఫిల్మ్‌నగర్‌లో ప్రచారం జరుగుతోంది. పూర్తి కథ సిద్ధం చేసి మరోసారి నరేషన్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే బాలయ్య–శివ నిర్వాణ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొనడం ఖాయం!

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘ఇరుముడి’..

మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఇరుముడి’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయ్యప్ప స్వామి భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాలను కలగలిపి రూపొందించిన ఈ చిత్రం థియేటర్లలో మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ముఖ్యంగా అయ్యప్ప భక్తుడిగా రవితేజ నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటింది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రవితేజ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. దీంతో ‘ఇరుముడి’ టాలీవుడ్‌లో 2026లో వచ్చిన భారీ విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.

థియేటర్ల నుంచి పల్లెల వరకు..

సినిమాలోని భక్తి పాటలు, అయ్యప్ప స్వామి బ్యాక్డ్రాప్ ఆడియన్స్ను విశేషంగా కనెక్ట్ చేశాయి. థియేటర్లలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో LED స్క్రీన్లపై సినిమా ప్రదర్శనల గురించి వస్తున్న పోస్టులు కూడా ‘ఇరుముడి’ క్రేజ్‌ను మరింత హైలైట్ చేసాయి.