మారుతి 800కు ప్రపంచ గుర్తింపు : 21 దేశాల కార్లతో పోటీ పడి గెలిచింది

మారుతి 800కు ప్రపంచ గుర్తింపు : 21 దేశాల కార్లతో పోటీ పడి గెలిచింది

భారతీయుల తొలి కారు కలను నిజం చేసిన మారుతి 800కు అరుదైన గౌరవం దక్కింది. ఒకప్పుడు సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు కారు ప్రయాణాన్ని చేరువ చేసిన ఈ చిన్న కారు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ వెహిక్యూల్స్ ఏన్షియన్స్ (FIVA) అందించే ప్రతిష్ఠాత్మక ‘వరల్డ్ వెహికల్ హెరిటేజ్ అవార్డు’ను మారుతి 800 గెలుచుకుంది. ఈ అవార్డును అందుకున్న తొలి, ఏకైక భారతీయ కారుగా మారుతి 800 నిలిచింది. భారత ఆటోమొబైల్ రంగ చరిత్రలో ఇదొక  ముఖ్యమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు.

21 అంతర్జాతీయ వాహనాల్లో మారుతి 800కు చోటు
ప్రపంచవ్యాప్తంగా చారిత్రక ప్రాధాన్యం ఉన్న వాహనాలను గుర్తించి గౌరవించే సంస్థ FIVA. రవాణా రంగంలో విశేషమైన మార్పులు తీసుకురావడంతోపాటు ప్రజల జీవితాలపై ఎక్కువకాలం ప్రభావం చూపిన వాహనాలకు ఈ సంస్థ పురస్కారాలు అందిస్తుంది.

ఈసారి ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన 21 చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న వాహనాలను పరిశీలించి మారుతి 800ను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. అమెరికా, బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రియా, స్లోవేనియా తదితర దేశాలకు చెందిన వాహనాలు కూడా ఈ ఎంపికలో ఉన్నాయి. వాటన్నింటిలో మారుతి 800 ప్రత్యేక గుర్తింపు పొందడం విశేషం.

ఈ సందర్భంగా మారుతి సుజుకి సంస్థ స్పందిస్తూ.. భారతదేశంలో కారు ప్రయాణాన్ని సామాన్యులకు చేరువ చేయడంలో మారుతి 800 కీలక పాత్ర పోషించిందని తెలిపింది. కేవలం ఒక కారు మోడల్‌గానే కాకుండా, దేశ ప్రజల నిత్య జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన వాహనంగా దీనిని గుర్తించినట్లు పేర్కొంది.

1983లో ప్రారంభమైన మారుతి 800 ప్రయాణం
భారతదేశంలో మారుతి 800 ప్రస్థానం 1983లో ప్రారంభమైంది. 1982లో సుజుకి మోటార్ కార్పొరేషన్ భారత ప్రభుత్వంతో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత 1983 డిసెంబర్‌లో మారుతి 800 తొలి కారును తయారు చేసింది.

ప్రారంభంలో ఏడాదికి సుమారు 40 వేల కార్లను ఉత్పత్తి చేసే స్థాయిలో కంపెనీ  ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అయితే క్రమంగా ఈ కారుకు ప్రజల్లో ఆదరణ పెరిగింది. తక్కువ ధర, చిన్న సైజు, ఈజీ మెయింటెనెన్స్ వంటి ప్రత్యేకతలతో మారుతి 800 మధ్యతరగతి కుటుంబాలకు బాగా దగ్గరైంది.

ముఖ్యంగా అప్పట్లో కారు కొనడం అనేది చాలా కుటుంబాలకు ఒక పెద్ద కలగా ఉండేది. అలాంటి సమయంలో మారుతి 800 అందుబాటులోకి రావడంతో సామాన్యులు కూడా సొంతంగా కారు కొనాలనే ఆలోచనకు ముందుకొచ్చారు. మొదటిసారి కారు కొనుగోలు చేసే కుటుంబాలకు ఇదొక మంచి అప్షన్ గా మారింది.

29 లక్షలకు పైగా కార్ల తయారీ
మారుతి 800కు ప్రజల్లో లభించిన ఆదరణ ఎంతటిదో దాని ఉత్పత్తి గణాంకాలే చెబుతున్నాయి. తొలి కారు తయారైనప్పటి నుంచి తర్వాతి మూడు దశాబ్దాల్లో 29 లక్షలకు పైగా మారుతి 800 కార్లను కంపెనీ తయారు చేసింది.

ఒకప్పుడు భారతీయ రోడ్లపై ఎక్కడ చూసినా మారుతి 800 కార్లు కనిపించేవి. ఉద్యోగులు, వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలు, చిన్న వ్యాపార సంస్థలు ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఈ కారు చేరువైంది. చాలా కుటుంబాల్లో ఇదే మొదటి సొంత కారు కావడం విశేషం.

మారుతి 800 రాకతో భారతదేశంలో వ్యక్తిగత రవాణా విధానంలో కూడా మార్పు వచ్చింది. గతంలో ఎక్కువగా ప్రజా రవాణా లేదా ద్విచక్ర వాహనాలపై ఆధారపడిన కుటుంబాలు సొంత కారును కొనుగోలు చేసే దిశగా అడుగులు వేశాయి.

విదేశాలకు ఎగుమతి చేసిన తొలి భారతీయ కార్లలో ప్రత్యేక స్థానం
మారుతి 800 కేవలం భారత మార్కెట్‌కే పరిమితం కాలేదు. దేశీయంగా మంచి ఆదరణ పొందిన ఈ కారు విదేశీ మార్కెట్లలోకి కూడా అడుగుపెట్టింది. 1987లో భారతదేశం నుంచి హంగరీ, ఫ్రాన్స్, బెల్జియం వంటి యూరోపియన్ దేశాలకు మారుతి 800 కార్ల ఎగుమతులు ప్రారంభమయ్యాయి.

భారతదేశంలో తయారైన కారును విదేశీ మార్కెట్లకు పంపించడం అప్పట్లో దేశ ఆటోమొబైల్ పరిశ్రమకు ఒక ముఖ్యమైన ముందడుగు. భారతదేశం కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన కార్లను తయారు చేయగలదని మారుతి 800 నిరూపించింది.

ప్రపంచంలో మూడో అతిపెద్ద కార్ల మార్కెట్‌గా భారత్
మారుతి సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 1982లో భారత ప్రభుత్వంతో కలిసి ప్రారంభించిన ప్రయాణం నేడు ఎంతో పెద్ద స్థాయికి చేరుకుందని తెలిపారు. 1983లో మారుతి 800 తయారీతో మొదలైన సంస్థ ప్రస్థానం భారత ఆటోమొబైల్ రంగంలో కీలక మార్పులకు కారణమైందని పేర్కొన్నారు.

చాలా చిన్న స్థాయిలో ప్రారంభమైన మారుతి 800 ప్రయాణం దేశంలో కార్ల వినియోగాన్ని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషించిందని ఆయన వివరించారు. ఈ కారు ద్వారా భారతదేశంలో కార్ల తయారీ రంగానికి కొత్త దిశ ఏర్పడిందని తెలిపారు.

భారతీయ ఇంజినీరింగ్ సామర్థ్యాన్ని నిరూపించిన కారు
మారుతి సుజుకి ఛైర్మన్ ఆర్.సి. భార్గవ కూడా ఈ అవార్డుపై స్పందించారు. మారుతి 800 తయారీ ప్రారంభమైన సమయంలో భారత్‌లో ఇంత నాణ్యమైన కార్లను తయారు చేయగలరా? అనే సందేహాలు చాలామందిలో ఉండేవని గుర్తు చేశారు.

అయితే మారుతి 800 ఆ సందేహాలన్నింటినీ తొలగించిందని తెలిపారు. భారతదేశం కూడా అత్యున్నత నాణ్యత కలిగిన ఇంజినీరింగ్ ఉత్పత్తులను తయారు చేయగలదని ఈ కారు ప్రపంచానికి చాటి చెప్పిందని పేర్కొన్నారు. 1987లోనే ఈ కారును యూరప్‌కు ఎగుమతి చేయడం భారత ఆటోమొబైల్ పరిశ్రమకు గర్వకారణమని వివరించారు.

కేవలం కారు కాదు.. కోట్లాది భారతీయుల జ్ఞాపకం!
మారుతి 800 అంటే చాలామందికి కేవలం ఒక వాహనం మాత్రమే కాదు. అది ఒక తరం జ్ఞాపకం. ఎన్నో కుటుంబాల మొదటి కారు, కొత్తగా ఉద్యోగంలో చేరిన వారి తొలి కల, చిన్న వ్యాపారుల ప్రయాణాలకు తోడుగా నిలిచిన వాహనం.

ఒకప్పుడు ఇంటి ముందు మారుతి 800 కారు ఉండటం ఎంతో గొప్ప విషయంగా భావించేవారు. కుటుంబ సభ్యులతో కలిసి మొదటి ప్రయాణం, కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం, పిల్లలతో చేసిన విహారయాత్రలు.. ఇలా ఎన్నో మధుర జ్ఞాపకాలతో ఈ కారు ముడిపడి ఉంది.

అందుకే మారుతి 800కు లభించిన ఈ అంతర్జాతీయ పురస్కారం కేవలం ఒక కంపెనీకి దక్కిన గౌరవం మాత్రమే కాదు. భారత ఆటోమొబైల్ రంగ చరిత్రకు, దేశీయ ఇంజినీరింగ్ సామర్థ్యానికి లభించిన గుర్తింపుగా చెప్పుకోవచ్చు. ఒక చిన్న కారు కోట్లాది మంది జీవితాల్లో ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో మారుతి 800 ప్రయాణం మరోసారి నిరూపించింది.