IPL 2027 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2027) రిటెన్షన్, రిలీజ్ ప్రక్రియ ముగియడంతో అన్ని జట్ల దృష్టి ఇప్పుడు డిసెంబర్ 16వ తేదీన గోవాలో జరగబోయే మినీ వేలంపై నజర్ పెట్టారు. ఆటగాళ్ల మార్పులు, ట్రేడింగ్ డీల్స్ నేపథ్యంలో కొన్ని జట్లను కెప్టెన్సీ సమస్య తీవ్రంగా వెంటాడుతోంది. జట్టును ముందుకు నడిపించే సమర్థుడైన నాయకుడు (Captaincy Dilemma) ఎవారనే దానిపై ఫ్రాంచైజీలు తీవ్ర తర్జనభర్జన పడుతున్నాయి. ప్రధాన జట్లలో కెప్టెన్సీ రేసులో ఉన్న ప్లేయర్స్ వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం..
ముంబై ఇండియన్స్ (MI): రోహిత్, సూర్య, బుమ్రా, తిలక్ వర్మ?
ఐపీఎల్‌లో అత్యధిక టైటిళ్లను గెలిచిన ముంబై ఇండియన్స్ గత కొన్ని సీజన్లుగా పేలవ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరుస్తోంది. గుజరాత్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యా సారథ్యంలోనూ టీమ్ భవితవ్యం మారకపోగా, సమస్యలు మరింత పెరిగాయి. దీంతో హార్దిక్‌ను పంజాబ్‌కు పంపించి.. అక్కడి నుంచి పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ముంబై తీసుకువచ్చింది.
రేసులో ఉన్నవారు: మాజీ సారథి రోహిత్ శర్మకు మళ్లీ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం కూడా జోరందుకుంది. హిట్మ్యాన్ తో పాటు సీనియర్లు జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలలో ఒకరికి సారథ్య బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. అయితే జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ పేరు కెప్టెన్సీ రేసులో ముందు వరుసలో ఉంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR): రేసులో రింకూ:
అజింక్య రహానే వీడ్కోలుతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో కెప్టెన్సీ లోటు క్లియర్ గా కనిపిస్తోంది. జట్టులో ఇతర ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ.. గత సీజన్లలో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించి, జట్టు సంక్షోభ సమయాల్లో ఆసరాగా నిలిచిన పవర్ హిట్టర్ రింకూ సింగ్‌ను కెప్టెన్‌గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
లక్నో సూపర్ జెయింట్స్ (LSG): లక్కు ఎవరికో:
కొత్త కెప్టెన్‌ను వెతుక్కునే ప్రధాన జట్లలో లక్నో సూపర్ జెయింట్స్ ఒకటి.. గతంలో ఆ జట్టును నడిపించిన రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ కి వెళ్లిపోగా.. కుల్దీప్ యాదవ్ లక్నోకి ట్రేడ్ అయ్యాడు. నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ పేర్లు రేసులో ఉన్నప్పటికీ.. సీనియర్ ఆటగాడైన ఐడెన్ మార్కరమ్ కే కెప్టెన్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును విజయవంతంగా నడిపించిన అనుభవం కూడా మార్కరమ్ సొంతం.
ఢిల్లీ క్యాపిటల్స్ (DC): అక్షర్ ఔట్.. రేసులో పంత్, రాహుల్:
లక్నో సూపర్ జెయింట్స్ ను వీడి రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి అడుగుపెట్టాడు. దీంతో ఢిల్లీలో కెప్టెన్సీ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పంత్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించేందుకే ఆ ఫ్రాంచైజీ అతడిని వెనక్కి తెచ్చుకుందనే వాదన గట్టిగానే వినిపిస్తోంది.
* మరోవైపు గత సీజన్‌లో జట్టును సమర్థవంతంగా నడిపించిన అక్షర్ పటేల్ పరిస్థితి ఏంటనే ప్రశ్న ఇప్పుడు వ్యక్తమవుతోంది. దీనికి తోడు సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా ఢిల్లీ సారథ్య బాధ్యతలపై కన్నేసినట్లు సమాచారం. దీంతో ఢిల్లీలో త్రిముఖ పోటీ నెలకొంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH): కమిన్స్ దూరమైతే నెక్ట్స్ కెప్టెన్ ఎవరు:
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో దూకుడును నేర్పించిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ నేతృత్వంలో జట్టు ఎన్నో రికార్డులను తిరగరాసింది. కానీ, వచ్చే సీజన్‌కు కమిన్స్ ఎంతవరకు అందుబాటులో ఉంటాడనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
ఒకవేళ కమిన్స్ జట్టుకు దూరమైతే.. గత సీజన్ ఫస్ట్ హాఫ్ జట్టును నడిపించిన ఇషాన్ కిషన్ కే ఆ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. అలాగే స్టేడియంలో నిత్యం దూకుడుగా ఉండే అభిషేక్ శర్మ కూడా కెప్టెన్సీ రేసులో నిలిచే అవకాశం కూడా లేకపోలేదు.
