లోన్ కట్టేసినా తాకట్టు తొలగించని బ్యాంక్.. హైదరాబాదీకి రూ.40 లక్షలు ఇప్పించిన కోర్టు!

లోన్ కట్టేసినా తాకట్టు తొలగించని బ్యాంక్.. హైదరాబాదీకి రూ.40 లక్షలు ఇప్పించిన కోర్టు!

బ్యాంకుల నిర్లక్ష్యం సాధారణ ప్రజల పాలిట ఎంత శాపంగా మారుతుందో చెప్పడానికి హైదరాబాద్‌లో జరిగిన ఓ ఘటనే ప్రత్యక్ష నిదర్శనం. అప్పు తీరిపోయి 10 ఏళ్లు గడిచినా, ప్రాపర్టీపై తనఖా(మోర్గేజ్) తొలగించని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌కు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కన్జూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ షాకిచ్చింది. 67 ఏళ్ల వృద్ధుడికి రూ. 40లక్షల 30వేల భారీ నష్టపరిహారాన్ని చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.

అసలేం జరిగింది?
హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన కొడుకు చదువు కోసం 2013 డిసెంబర్ 21న తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.8 లక్షల ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాడు. ఆ సమయంలో తన ప్రాపర్టీని తనఖాగా పెట్టి రిజిస్టర్డ్ మోర్గేజ్ డీడ్‌ను బ్యాంకుకు సమర్పించాడు. లోన్ తీసుకున్న వ్యక్తి ఎంతో బాధ్యతగా వ్యవహరించి 2016 సెప్టెంబర్ 1 నాటికే లోన్ మొత్తాన్ని పూర్తిగా చెల్లించేశాడు. లోన్ క్లోజ్ కావటంతో బ్యాంకు అధికారులు ఒరిజినల్ డాక్యుమెంట్లను కూడా తిరిగి ఇచ్చేశారు.

కానీ అక్కడే అసలు సమస్య మొదలైంది. డాక్యుమెంట్లు ఇచ్చిన బ్యాంక్ అధికారులు.. సబ్-రిజిస్ట్రార్ రికార్డుల నుంచి ప్రాపర్టీపై ఉన్న మోర్గేజ్ ఎంట్రీని తొలగించడానికి అవసరమైన 'రిలీజ్, రీకన్వేయన్స్ డీడ్'ను మాత్రం రిజిస్టర్ చేయించలేదు. ఈ విషయం బాధితుడికి 2018లో ఇల్లు అమ్మడానికి ప్రయత్నించినప్పుడు బయటపడింది. ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్‌లో ప్రాపర్టీ ఇంకా బ్యాంక్ తాకట్టులోనే ఉన్నట్లు చూపించడంతో అమ్మకం నిలిచిపోయింది. దీనిపై బాధితుడు ఏడేళ్లపాటు బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోయింది. చివరికి గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయగా.. 2025 సెప్టెంబర్‌లో బ్యాంకు మొండి సమాధానం ఇచ్చింది.

కోర్టు ఆగ్రహం:
దీంతో విసిగిపోయిన బాధితుడు కన్జూమర్ కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి కన్జూమర్ కోర్టు ప్రెసిడెంట్ వాక్కంటి నర్సింహ రావు, సభ్యులు పీవీటీఆర్ జవహర్ బాబు, సుమ వాలాలతో కూడిన ధర్మాసనం నవంబర్ 3, 2026న తుది తీర్పు వెలువరించింది. లోన్ తీరిపోయినా మోర్గేజ్ తొలగించకపోవడం 'సేవల్లో లోపం' కిందకే వస్తుందని వారు పేర్కొన్నారు.

ఆర్బీఐ 2023 సెప్టెంబర్ 13 సర్క్యులర్ ప్రకారం.. లోన్ తీరిన 30 రోజుల్లోగా రిజిస్టర్డ్ చార్జీలను తొలగించకపోతే రోజుకు రూ. 5వేలు చొప్పున బ్యాంక్ పరిహారం చెల్లించాలి. ఈ నిబంధనను ఆధారంగా చేసుకుని.. మార్టగేజ్ రిలీజ్ రిజర్వు బ్యాంక్ కొత్త రూల్ కింద 795 రోజుల ఆలస్యానికి గాను రూ.39లక్షల 75వేలు, మానసిక వేదనకు రూ. 50వేలు, లిటిగేషన్ ఖర్చులు రూ. 5వేలు కలిపి మొత్తం రూ. 40లక్షల 30వేలు బ్యాంక్ బాధితుడికి చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా రెండు వారాల్లోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని.. 2025 డిసెంబర్ 31 నుంచి 9 శాతం వార్షిక వడ్డీని కూడా చెల్లించాలని తేల్చిచెప్పింది. కస్టమర్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహించే బ్యాంకులకు తాజా కోర్టు తీర్పు చెంపపెట్టుగా నిలిచింది.