జావేద్ అక్తర్ కాదు.. రామ్ పాల్‎గా పేరు మార్చుకో: రామున్ని పొగడటంపై మత గురువు సీరియస్

జావేద్ అక్తర్ కాదు.. రామ్ పాల్‎గా పేరు మార్చుకో: రామున్ని పొగడటంపై మత గురువు సీరియస్

న్యూఢిల్లీ: శ్రీరాముడు, రామాయణాన్ని ప్రశంసించినందుకు ప్రముఖ గీత రచయిత, స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్‌ను ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ అధ్యక్షుడు మౌలానా సాజిద్ రషీది తీవ్రంగా విమర్శించారు. జావేద్ అక్తర్ ఒక వ్యాపారవేత్త అని, బాలీవుడ్‌లో తన పాటలు అమ్ముడుపోవడానికి, వ్యాపార ప్రయోజనాల కోసమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. గతంలో తనను తాను నాస్తికుడినని బహిరంగంగా ప్రకటించుకున్న వ్యక్తి ఇప్పుడు రాముడిపై ఇంత భక్తిని ప్రదర్శించడం ఏంటని ప్రశ్నించారు. 

అక్తర్ రెండు పడవల ప్రయాణం చేస్తూ అందరినీ మెప్పించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాముడిపై అంత భక్తి ఉంటే జావేద్ అక్తర్ తన పేరును రామ్ పాల్‎గా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. అలా చేస్తే దేశంలో మెజారిటీ వర్గమైన హిందువుల పూర్తి గౌరవం ఆయనకు లభిస్తుందని పేర్కొన్నారు. అక్తర్ తన నిజాయితీని రాజీ పడ్డాడని.. అతనిలాంటి వారు ఆర్థిక ప్రయోజనాల కోసం తమ నిజాయితీనే వదులుకుంటారని విమర్శించారు.

అసలు జావేద్ అక్తర్ ఏమన్నారంటే..?

రాముడు కేవలం ఒక మతానికి పరిమితమైన వ్యక్తి మాత్రమే కాదని.. ఆయన ఒక నైతికత, జీవన విధానం, కొన్ని సౌందర్య భావనలకు ప్రతీక అని ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ ప్రశంసించారు. దేశంలో మతంతో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడి రక్తంలో శ్రీరాముడు ఉన్నాడని పేర్కొన్నారు. జావేద్ అక్తర్ వ్యాఖ్యలపై ఆయన సొంత కమ్యూనిటీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో ఇతర వర్గాల నుంచి ఆయనకు మద్దతుగా లభిస్తోంది.