ఏపీ జలదోపిడీ: నాగార్జున సాగర్ యజమాని మనమే.. కానీ..

ఏపీ జలదోపిడీ: నాగార్జున సాగర్ యజమాని మనమే.. కానీ..

శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నిర్వహణలో  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదం కొనసాగుతుండగా.. నీటి పంపిణీలోనూ రెండు రాష్ట్రాల మధ్య అసమానతలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విభజన చట్టం ప్రకారం నాగార్జునసాగర్ నిర్వహణ బాధ్యత తెలంగాణకు అప్పగించినప్పటికీ.. ప్రాజెక్టులోని ఏపీ వైపు భద్రత, పర్యవేక్షణ, నీటి వినియోగంపై వివాదం తలెత్తుతోంది. దీనికి తోడు  నీటి తరలింపులో రెండు రాష్ట్రాలకు ఉన్న టెక్నికల్ లభ్యతలోనూ తేడా కనిపిస్తున్నది. ఏపీ వైపు కుడి కాల్వ ద్వారా తక్కువ నీటిమట్టంలోనూ గ్రావిటీ ద్వారా నీటిని తరలించుకునే అవకాశం ఉండగా.. తెలంగాణకు మాత్రం 510 అడుగుల నీటిమట్టం దాటిన తర్వాత నీటిని తోడుకునేందుకు మోటార్లపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఒకవైపు సాగర్ నిర్వహణాధికారాలపై వివాదం.. మరోవైపు నీటి తరలింపు వ్యవస్థలో టెక్నికల్ అసమానతలు.. ఇంకోవైపు ఏపీ చేపడుతున్న కొత్త నీటి ప్రాజెక్టులపై అభ్యంతరాలు.. ఇవన్నీ కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ జరుగుతున్న అన్యాయంపై మరోసారి చర్చ మొదలైంది. 

విభజన చట్టం ప్రకారం ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్​ల నిర్వహణపై కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. శ్రీశైలం నిర్వహణను ఏపీకి, నాగార్జునసాగర్​ నిర్వహణను తెలంగాణకు అప్పజెప్పింది. కానీ, సాగర్​ ప్రాజెక్టు మనకు దక్కితే ఏపీ ఆటలు సాగవన్న ఉద్దేశంతో ఆ రాష్ట్రం.. తనవైపు భాగాన్ని మొత్తం ఆక్రమించేసింది. తెలంగాణ అధికారులను కనీసం అటువైపు రానివ్వడం లేదు. చెకింగ్​ కోసం వెళ్తే గొడవలకు దిగుతున్నది. దాడులు చేయిస్తున్నది. 2023 ఎన్నికలకు ముందు జరిగిన ఘర్షణలే అందుకు నిదర్శనం. 

మన అధీనంలో ఉండాల్సిన ప్రాజెక్టును మనకు కాకుండా చేసేసి.. సాగర్​ ప్రాజెక్టునూ ఖాళీ చేయాలన్న దుర్బుద్ధితో ఏపీ ఇలా అక్రమ ప్రాజెక్టులను నిర్మిస్తున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి సాగర్​ ప్రాజెక్టులోనూ తెలంగాణకు అన్యాయమే జరిగింది. ఇప్పటికే ఏపీ వైపు కుడి కాల్వ ద్వారా డెడ్​ స్టోరేజ్​దిగువ నుంచి కూడా ఆ రాష్ట్రం నీటిని తీసుకుపోవడానికి వీలుంది. మనకు మాత్రం ఎక్కడో దూరంగా కొండల్లో హెడ్​ రెగ్యులేటర్​ను నిర్మించి ఇచ్చారు. 

సాగర్​ నీటి మట్టం 510 అడుగులకు పడిపోతే.. మనం మోటార్లు పెట్టి నీటిని తరలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ, ఏపీ మాత్రం ఎంచక్కా 149 అడుగుల మట్టం నుంచి కూడా గ్రావిటీ ద్వారానే వందల టీఎంసీల నీళ్లను మళ్లించుకునే ఏర్పాట్లు చేసుకుంటుండడం కలవరపెడ్తున్నది.