నిరుపేద కుటుంబాలలోని బాలికల విద్య, ఉన్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సుకన్య సమృద్ధి యోజనా (SSY) స్కీమ్‌లో ప్రస్తుతం 8.2 శాతం వార్షిక వడ్డీ ఇస్తున్నారు. నెలకు 10 వేల రూపాయల చొప్పున 15 ఏళ్లు జమ చేస్తే, అమ్మాయికి 21 ఏళ్లు నిండాక సుమారు ₹55.46 లక్షలు వస్తాయని అంచనా. అయితే ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ రేటును సమీక్షిస్తుంది. అందువల్ల.. చివరికి వచ్చే మొత్తం తక్కువ లేదా ఎక్కువ అవుతుందని గమనించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'బేటీ బచావో, బేటీ పఢావో' అభియాన్‌లో భాగంగా 2015 జనవరి 22న ఈ స్కీమ్‌ను ప్రారంభించారు.
బాలికల చదువు, పెళ్లి కోసం పొదుపు చేయడానికి తల్లిదండ్రులను ప్రోత్సహించడమే దీని లక్ష్యం. అసలు మొత్తానికి, వడ్డీకి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. భారత పౌరసత్వం ఉన్న బాలిక జన్మించిన దగ్గర నుంచి 10 ఏళ్లు నిండే వరకు తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు ఖాతా తెరవొచ్చు. ఒక బాలిక పేరు మీద ఒక్క ఖాతా మాత్రమే తెరవడానికి వీలవుతుంది. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు బాలికల పేరు మీద ఖాతా తెరవొచ్చు. పోస్ట్ ఆఫీసు, ప్రభుత్వ బ్యాంకులు, అలాగే HDFC, యాక్సిస్, ICICI, IDBI అనే నాలుగు ప్రైవేట్ బ్యాంకుల్లో ఈ ఖాతా తెరవొచ్చు.
దేశంలో ఎక్కడికి మారినా ఖాతాను అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బాలికకు 18 ఏళ్లు నిండే వరకు తల్లిదండ్రులు ఖాతా నిర్వహిస్తారు. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి బాలిక స్వయంగా ఖాతా నిర్వహించుకోవచ్చు. కనీసం ₹250తో ఖాతా మొదలవుతుంది. ఆ తర్వాత ₹100, ₹500 చొప్పున జమ చేయవచ్చు. ఒక సంవత్సరంలో కనీసం ₹250, గరిష్టంగా ₹1.50 లక్షలు జమ చేయవచ్చు. ఖాతా తెరిచిన తేదీ నుంచి 15 ఏళ్ల వరకు మాత్రమే జమలు చేయాలి. ప్రతి నెలా వడ్డీ లెక్కిస్తారు. అయితే అది ప్రతి ఆర్థిక సంవత్సరం చివర్లో ఖాతాకు జమవుతుంది.
►ALSO READ | డిప్రెషన్ నుంచి బయట పడాలంటే.. ఎలా ఆలోచించాలో తెలుసా..!
ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో వడ్డీ రేటు నిర్ణయిస్తుంది. బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాత లేదా 10వ తరగతి పాసైన తర్వాత (ఏది ముందు వస్తే అది), ఉన్నత చదువుల కోసం ఖాతాలో ఉన్న మొత్తంలో 50 శాతం వరకు విత్‌డ్రా చేయవచ్చు. దానికి కాలేజ్ అడ్మిషన్ లెటర్ లేదా ఫీజు రసీదు జమ చేయాలి. ఫీజు మొత్తానికి మించి డబ్బు తీయడానికి వీలుండదు. ఒకేసారి లేదా ఏడాదికోసారి కిస్తీల్లో వరుసగా 5 ఏళ్ల వరకు తీయవచ్చు.
