మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భార్య, అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కొణిదెల ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా, చిరునవ్వుతో కనిపిస్తుంటారు. అయితే ఆ నవ్వు వెనుక తాను అనుభవించిన బాధ, మానసిక సంఘర్షణ ఎంత తీవ్రంగా ఉన్నాయో తాజాగా ఆమె బయటపెట్టారు. ముఖ్యంగా రెండోసారి కవలలకు జన్మనిచ్చిన తర్వాత ఎదురైన అనుభవాలను గుర్తుచేసుకుంటూ స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. తన మనసు ఇప్పటికీ ఆ అనుభవాల నుంచి పూర్తిగా కోలుకోలేదని చెప్పడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సెకండ్ ప్రెగ్నెన్సీ.. ఊహించని ఇబ్బందులు!
మంగళవారం నవంబర్ 17న హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడలో జరిగిన అపోలో ఆసుపత్రుల ఓపెనింగ్ కార్యక్రమంలో ఉపాసన తన మాతృత్వ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా గర్భం దాల్చేందుకు ప్రయత్నించే మహిళలు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి, ప్రసవం తర్వాత తల్లులకు అవసరమైన వైద్య, కుటుంబ సహకారం గురించి తన అనుభవాలను పంచుకున్నారు.
తొలి ప్రెగ్నెన్సీ టైంలో ఇబ్బందులు లేకపోయినా, రెండోసారి కవలలకు జన్మనిచ్చిన తర్వాత శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపారు. వాటి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు. తన ముఖంపై కనిపించే చిరునవ్వు వెనుక ఇంకా కోలుకుంటున్న ఓ తల్లి ఉందని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ అనుభవం గురించి పూర్తిగా మాట్లాడేంత మానసిక స్థైర్యం కూడా ఇంకా తనకు రాలేదని పేర్కొన్నారు.
ప్రెగ్నెన్సీ మహిళల బాధను గుర్తించాలి..
గర్భం దాల్చేందుకు ప్రయత్నించే మహిళలు ఎన్నో మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటారని ఉపాసన తెలిపారు. నెలసరి ఆలస్యమైతే ఆశలు చిగురిస్తాయని, తిరిగి నెలసరి వస్తే తీవ్ర నిరాశ కలుగుతుందని చెప్పారు. సహజంగా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించినా, ఫెర్టిలిటీ ట్రీట్మెంట్లు తీసుకున్నా మహిళల భావోద్వేగాలు ఒకేలా ఉంటాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో మహిళల మానసిక ఆరోగ్యంపై కూడా సమాజం దృష్టి పెట్టాలని సూచించారు.
►ALSO READ | ఇరుముడి సూపర్ సక్సెస్: అయ్యప్ప మాల ధరించిన డైరెక్టర్ శివ నిర్వాణ, నిర్మాత మైత్రీ రవి
నాలుగో ట్రైమిస్టర్'లో తల్లికి అండగా ఉండాలి!
సాధారణంగా గర్భధారణను మూడు ట్రైమిస్టర్లుగా విభజిస్తారని, అయితే, ప్రసవం తర్వాత తొలి మూడు నెలలు తల్లులకు ఎంతో కీలకమని ఉపాసన తెలిపారు. ఈ సమయంలో శారీరకంగా కోలుకోవడంతో పాటు మానసికంగానూ ఎన్నో మార్పులు ఎదురవుతాయని చెప్పారు. అందుకే కుటుంబ సభ్యులు, భర్త తల్లికి అండగా నిలవాలని సూచించారు. తన కష్టకాలంలో వైద్యులు, నిపుణులతో పాటు రామ్ చరణ్ కూడా ఎంతో సహకరించారని గుర్తుచేసుకున్నారు. ప్రసవానంతర సంరక్షణ విలాసం కాదని, ప్రతి తల్లికి అవసరమని పేర్కొన్నారు.
బిడ్డతో పాటు తల్లి ఆరోగ్యానికీ ప్రాధాన్యత ఇవ్వాలి..
బిడ్డ పుట్టిన తర్వాత కుటుంబ సభ్యులంతా శిశువు సంరక్షణపైనే దృష్టి పెడతారని, అయితే తల్లి ఆరోగ్యాన్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలని ఉపాసన సూచించారు. ముఖ్యంగా ప్రసవానంతరం మహిళల్లో వచ్చే మానసిక మార్పులను అర్థం చేసుకోవాలని, వారికి ప్రేమ, విశ్రాంతి, అవసరమైన వైద్య సహాయం అందించాలని కోరారు. ప్రతి తల్లికి కుటుంబ సభ్యుల అండ, ఆప్యాయత ఎంతో అవసరమని ఆమె సందేశమిచ్చారు.
రామ్ చరణ్-ఉపాసన పిల్లల పేర్లు..
రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ముగ్గురు పిల్లలు. 2023 జూన్ 20న వీరికి తొలి సంతానంగా కుమార్తె జన్మించింది. ఆమెకు క్లిన్ కారా కొణిదెల (Klin Kaara Konidela) అని పేరు పెట్టారు. 2026 జనవరి 31న ఈ దంపతులు కవలలకు జన్మనిచ్చారు. ఒక బాబు, ఒక పాపకు జన్మనివ్వడంతో మెగా కుటుంబంలో ఆనందం రెట్టింపైంది. అనంతరం ఫిబ్రవరి 2026లో నిర్వహించిన నామకరణ వేడుకలో కవలల పేర్లను వెల్లడించారు.. శివరామ్ కొణిదెల, అన్వీరా దేవి కొణిదెల అని పేరు పేరు పెట్టారు.
