సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సీనియర్ నేత అజామ్ ఖాన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మనీ లాండరింగ్ కేసులో అజామ్ ఖాన్ కు లభించిన మధ్యంతర బెయిల్ పై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం విచారించేందుకు బుధవారం (నవంబర్ 18) కోర్టు అంగీకరించింది.
చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. ఈడీ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు.. ఈ అంశంపై అత్యవసర విచారణ జరపాలని కోరారు. అజాం ఖాన్ మధ్యంతర బెయిల్ పై స్టే ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే ఈడీ విజ్ణప్తిని ధర్మాసనం తిరస్కరించింది. అతన్ని మధ్యంతర బెయిల్‌పై ఉండనివ్వండి.. ఆకాశం ఏమీ ఊడిపడదు" అని అంటూ వ్యాఖ్యలు చేసింది.
అజాం ఖాన్ కు మధ్యంతర బెయిల్ ఇస్తూ అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబడుతూ ఎస్వీ రాజు వాదించారు. విచారణ పూర్తి కాకముందే ట్రయల్ ముగిసినట్లుగా కోర్టు బెయిల్ మంజూరు చేసిందని అన్నారు. ఈడీ అరెస్టును ‘దురుద్దేశపూర్వక’ చర్యగా హైకోర్టు అభివర్ణించడాన్ని ఆయన అభ్యంతరం తెలిపారు. అజాం ఖాన్ ఒక కేసులో జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఈడీ అరెస్టు చేయడంలో తప్పులేదని కోర్టుకు వివరించారు.
గతంలో అలహాబాద్ హైకోర్టు అజాం ఖాన్‌కు బెయిల్ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. పీఎంఎల్‌ఏ (PMLA) సెక్షన్ 19, రాజ్యాంగంలోని అధికరణ 22(1) ప్రకారం అరెస్టు నిబంధనలను ఈడీ కచ్చితంగా పాటించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. 78 ఏళ్ల అజామ్ ఖాన్ ఒక ఫోర్జరీ కేసులో రాంపూర్ జైలు నుంచి విడుదలైన కొద్ది నిమిషాల్లోనే అక్టోబర్ 31న ఈడీ అరెస్టు చేయడాన్ని కోర్టు ప్రశ్నించింది. ఇది దురుద్దేశపూర్వక చర్యగా కనిపిస్తోందని పేర్కొంది.
మౌలానా మహ్మద్ అలీ జౌహర్ ట్రస్ట్ నిధుల మళ్లింపు, జౌహర్ యూనివర్సిటీ భూసేకరణలో అక్రమాల ఆరోపణలపై అజామ్ ఖాన్‌పై ఈ మనీ లాండరింగ్ కేసు నమోదైంది. మరోవైపు, నకిలీ బర్త్ సర్టిఫికేట్ కేసులో ఆయన శిక్షపై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ యూపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. దీంతో అజామ్ ఖాన్‌కు వరుసగా రెండు కేసుల్లో న్యాయపరమైన ఊరట లభించినట్లయింది. హైకోర్టు ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం డిసెంబర్ 10కి వాయిదా వేసింది.
