బాక్సాఫీస్ వద్ద వెండితెరపైనే కాదు.. ఓటీటీ వేదికపై కూడా తెలుగు కంటెంట్ తన సత్తా ఏంటో నిరూపిస్తోంది. ప్రముఖ దర్శకుడు దేవ కట్టా రూపొందించిన పొలిటికల్ వెబ్ సిరీస్ 'మాయసభ: రైజ్ ఆఫ్ ది టైటాన్స్' అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్ఠాత్మక 57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) అవార్డుల బరిలో నిలిచింది. బెస్ట్ వెబ్ సిరీస్ (OTT) విభాగంలో నామినేషన్ దక్కించుకుని తెలుగు ఓటీటీ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేపింది.
గోవా వేదికగా 57వ IFFI వేడుకలు..
గోవా వేదికగా 57వ IFFI వేడుకలు2026 నవంబర్ 20 నుంచి 28 వరకు జరగనున్నాయి. ఈ వేడుకల్లో ఈ సిరీస్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ విభాగం 2023లో ప్రారంభమైనప్పటి నుంచి నామినేషన్ అందుకున్న తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా 'మాయసభ' నిలిచినట్లు ప్రకటించారు. గతంలో 'పంచాయత్ సీజన్ 2', 'బందిష్ బాండిట్స్ సీజన్ 2', మరాఠీ సిరీస్ 'లంపన్' వంటి ప్రాజెక్టులు ఈ విభాగంలో గుర్తింపు పొందాయి. ఇప్పుడు ఆ జాబితాలో తెలుగు సిరీస్ చేరింది.
అధికారం కోసం పోరు!
1970ల మధ్య కాలం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న రాజకీయ, సామాజిక పరిణామాల నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది. ఆదర్శ భావాలున్న విద్యార్థి నాయకుడు కాకర్ల కృష్ణమ నాయుడు (KKN), పలుకుబడి ఉన్న కుటుంబానికి చెందిన ఎంఎస్ రామిరెడ్డి (MSR) మధ్య స్నేహం, ఆ తర్వాత రాజకీయ ప్రయాణం చుట్టూ కథ సాగుతుంది. సిద్ధాంతాలు, కుల సమీకరణాలు, డబ్బు, అధికారం, వ్యక్తిగత ఆశయాలు మనుషుల సంబంధాలను ఎలా మార్చేస్తాయో ఆసక్తికరంగా చూపించారు.
►ALSO READ | Javed Akhtar: ప్రతి భారతీయుడి రక్తంలో శ్రీరాముడు.. జావెద్ అక్తర్ వ్యాఖ్యలపై ముస్లిం నేతల ఫైర్!
దేవ కట్టా, కిరణ్ జయ్ కుమార్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో ఆది పినిశెట్టి, చైతన్య రావు, సాయికుమార్, దివ్య దత్తా, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌కు జాతీయ స్థాయిలో వచ్చిన గుర్తింపు తెలుగు ఓటీటీ పరిశ్రమకు గర్వకారణం. మరి IFFI అవార్డును కూడా 'మాయసభ' సొంతం చేసుకుంటుందేమో చూడాలి...
