హైదరాబాద్, వెలుగు: జన గణనలో ఓబీసీ కులాల డ్రాప్-డౌన్ జాబితాను అందుబాటులో ఉంచకపోవడం బాధాకరమని బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ అన్నారు. మతాలు, ఎస్సీ, ఎస్టీల జాబితాలను పొందుపరిచి ఓబీసీ జాబితాను విస్మరించడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ అంశంపై బుధవారం ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు, రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ మృత్యుంజయ్ నారాయణ్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు.
జనగణనకు సంబంధించి ‘స్వీయ నమోదు ప్రక్రియ’ (se.census.gov.in) వెబ్సైట్లో మతాల వివరాలు, ఎస్సీ, ఎస్టీ కాలమ్‌లు ఉన్నాయని నిరంజన్ గుర్తుచేశారు. ఇతర మతాల కింద 77 వర్గాల జాబితాను, ఆయా రాష్ట్రాల ఎస్సీ, ఎస్టీల జాబితాలను డ్రాప్-డౌన్ పద్ధతిలో ఎంపిక చేసుకునే సౌకర్యం కల్పించారని తెలిపారు.
కానీ, ఓబీసీలు, ఇతర కులాల వివరాలకు ఆ అవకాశం ఇవ్వకపోవడంతో కులం పేర్లను మాన్యువల్‌గా టైప్ చేయాల్సి వస్తోందన్నారు. దీనివల్ల ఒకే కులానికి చెందిన వారు వేర్వేరు స్పెల్లింగ్‌లతో నమోదు చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కులగణన సమయంలోనూ ఇదే విధానాన్ని అనుసరించారని, ఫలితంగా అనేక లోపాలు దొర్లి ఆ డేటా అధికారిక అవసరాలకు పనికిరాకుండా పోయిందని లేఖలో ప్రస్తావించారు.
కులాల జాబితా లేకపోవడం వల్ల ఒకే కులాన్ని వివిధ రకాలుగా నమోదు చేసే అవకాశం ఏర్పడిందని గతంలో సుప్రీంకోర్టులో కేంద్రం సమర్పించిన అఫిడవిట్లోనే పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తక్షణమే అధికారులు స్పందించి, వెబ్సైట్లో ఓబీసీ కులాల డ్రాప్-డౌన్ జాబితాను అందుబాటులోకి తీసుకురావాలని నిరంజన్ విజ్ఞప్తి చేశారు.
