- కోకాపేట, నియో పోలిస్, ఖానామెట్, తెల్లాపూర్‌లో అధిక నిర్మాణాలు
- మొత్తం అమ్ముడయ్యేందుకు రెండున్నరేండ్లు
- ఐసీఆర్ఏ నివేదికలో వెల్లడి
- భారీగా ధరలు, పబ్లిక్ దగ్గర పైసలు తగ్గడమే కారణమంటున్న నిపుణు
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ లో ఇళ్ల కొనుగోలు కంటే నిర్మాణం శరవేగంగా సాగుతోంది. దీంతో నిర్మించిన ఇళ్లు, ఫ్లాట్స్ కొనుగోలు కాకుండా అన్ సోల్డ్ గా నిలిచిపోతున్నాయి. దేశంలో టాప్ 7 మెట్రో సిటీలతో పోలిస్తే హైదరాబాద్ లోనే ఎక్కువ అన్ సోల్డ్ ఇళ్లు , ఫ్లాట్స్ ఉన్నట్లు ఇటీవల ఐసీఆర్ఏ (ఇన్ వెస్ట్ మెంట్ ఇన్ ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ) నివేదిక లో తేలింది. మార్కెట్లో పెద్ద ఎత్తున ఇళ్లు అమ్ముడుపోకుండా మిగిలిపోతున్నప్పటికీ, బిల్డర్లు మాత్రం కొత్త ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తూనే ఉన్నారు. దీంతో డిమాండ్‌కు, సరఫరాకు మధ్య అంతరం పెరుగుతున్నట్లు ఈ ఏజెన్సీ పేర్కొంది.
రికార్డు స్థాయిలో అమ్ముడుపోని ఇళ్లు
ఐసీఆర్ఏ నివేదిక ప్రకారం..2026 జూన్ నాటికి హైదరాబాద్‌లో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన నివాస గృహాల (అన్ సోల్డ్ ప్రాపర్టీ) నిల్వలు ఏకంగా 29.6 కోట్ల ఎస్ఎఫ్టీ ఉన్నట్లు రిపోర్ట్ లో తేలింది. దేశంలోని ఇతర ఏడు మెట్రో సిటీలతో పోలిస్తే, ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 30 శాతం మేర అమ్ముడుపోని స్టాక్ ఉండటం గమనార్హం. బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ పుణె, కోల్‌కతాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే 'ఇన్వెంటరీ ఓవర్‌హ్యాంగ్' (ఉన్న స్టాక్ అమ్ముడుపోవడానికి పట్టే సమయం) అత్యధికంగా ఉంది. ప్రస్తుత విక్రయ వేగాన్ని బట్టి చూస్తే, ఈ స్టాక్ మొత్తం అమ్ముడవడానికి రెండున్నర ఏళ్లు పట్టవచ్చని ఏజెన్సీ అంచనా వేసింది. 2024 మార్చ్ నాటికి అన్ సోల్డ్ ప్రాపర్టీలు పూర్తిగా అమ్మడవటానికి 18 నెలల టైమ్ పట్టగా ఇపుడు రెండున్నర ఏళ్లకు చేరింది.
కొనుగోళ్ల కంటే కొత్త ప్రాజెక్ట్‌లే ఎక్కువ
వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశంలోని టాప్-7 నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే కొత్త నివాస గృహాల లాంచ్‌లు అత్యధికంగా ఉండనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త ప్రాజెక్ట్‌లు 30 శాతం నుండి 33 శాతం వరకు పెరుగుతాయని ఐక్రా అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో డెవలపర్లు 13.3 కోట్ల ఎస్ ఎఫ్ టీ విస్తీర్ణంలో నివాస గృహాలను లాంచ్ చేయగా, కేవలం 11.8 కోట్ల చదరపు అడుగుల ఇళ్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే అమ్మకాల కంటే ఏకంగా 1.5 కోట్ల ఎస్ ఎఫ్ టీ మేర ఇళ్ల నిర్మాణం అదనంగా జరిగింది. 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనూ కొత్త ప్రాజెక్ట్‌ల జోరు 76.7 శాతం మేర ఎగబాకగా, అమ్మకాలు మాత్రం కేవలం 17.3 శాతం మాత్రమే వృద్ధి చెందాయి.
లగ్జరీ ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో హైదరాబాద్ దే హవా
హైదరాబాద్ లో పెరుగుతున్న అమ్ముడుపోని నివాసాల్లో లగ్జరీ ఇళ్లదే ప్రధాన పాత్ర అని నివేదిక తెలిపింది. పెరిగిన అమ్ముడుపోని స్టాక్‌లో దాదాపు 45- నుంచి 50 శాతం లగ్జరీ ప్రాజెక్ట్‌లవే ఉన్నాయి. ముఖ్యంగా వెస్ట్ హైదరాబాద్‌లోని కోకాపేట్, నియోపొలీస్, తెల్లాపూర్, ఖానామెట్, కొల్లూరులో భారీ ఎత్తున టవర్లను నిర్మాణ రంగ కంపెనీలు నిర్మిస్తున్నాయి. నగరంలోని మొత్తం లాంచ్‌లు, అమ్మకాల్లో దాదాపు 85- నుంచి 90 శాతం నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్ ప్రాంతాల్లోనే ఎక్కువ నిర్మాణాలు సాగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఐటీ కంపెనీలకు దగ్గరగా ఉండటం, మౌలిక వసతులు మెరుగుపడటంతో బిల్డర్లు ఈ ప్రాంతాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అయితే, ఇటీవల కాలంలో బిల్డర్లు కాస్త అప్రమత్తమై లగ్జరీ నుండి మిడ్-సెగ్మెంట్ (మధ్యతరగతి) ఇళ్ల వైపు మళ్లుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. టవర్స్ లో ఫ్లాట్లు రూ.కోటి నుంచి రూ. 5 కోట్ల వరకు ధరలు పలుకుతున్నాయి.
భారీగా ధరలు, పబ్లిక్ వెనకడుగు
హైదరాబాద్ లో అపార్ట్ మెంట్ ఫ్లాట్స్ ధరలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం 1500 ఎస్ ఎఫ్ టీ ఉన్న త్రిబుట్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఏ ఏరియాలో కొనాలన్నా రూ.కోటికి తక్కువ లేదు. మధ్యతరగతి ప్రజలు మాత్రం రూ. 50 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకు కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. భారీగా ధరలు ఉండటం, లోన్లు తీసుకుంటే 30 ఏళ్ల పాటు ఈఎంఐలు, వడ్డీలు కట్టడం భారంగా భావిస్తున్నారు. మరో వైపు గతంలో ఉన్నట్లుగా లిక్విడ్ క్యాష్ లేకపోవటంతో వెనుకడుగు వేస్తున్నారు. ఒక వేళ ఉన్నా రూ. కోటి పెట్టి కొనటానికి ఆసక్తి చూపటం లేదు. ప్లాట్ కంటే భూమి కొనుగోలు చేయటం బెటర్ అని భావిస్తున్నారు. ప్రాపర్టీ షోలకు వచ్చే పబ్లిక్ సైతం రూ. 1 కోటి లోపు ఉండే ప్లాట్ల గురించే ఎక్కువ వివరాలు అడుగుతున్నారని బిల్డర్లు చెబుతున్నారు.
మార్కెట్ కు ఢోకా లేదు
హైదరాబాద్ లో పెరుగుతున్న అమ్ముడుపోని ఇళ్ల నిల్వలు ఉన్నా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోతుందనే ప్రచారం తప్పని బిల్డర్లు చెబుతున్నారు. ఇళ్ల విక్రయాల పరంగా దేశంలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌గా హైదరాబాద్ కొనసాగుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల విక్రయాలు 11 శాతం నుండి 14 శాతం వరకు వృద్ధి చెందుతాయని బిల్డర్లు అంచనా వేస్తున్నారు. ధరల పరంగా మాత్రం ఎలాంటి భారీ మార్పులు లేదా తగ్గుదల ఉండే అవకాశం లేదని ఐసీఆర్ ఏ నివేదిక పేర్కొంటోంది.
పెట్టుబడి కోసం కొన్ని ఖాళీగా ఉంచుతున్నారు
హైదరాబాద్ లో నిర్మాణ రంగం శర వేగంగా సాగుతోంది. 20,30 ఫ్లోర్లలో భారీ టవర్లు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తి కావటానికి మినిమం 5 ఏళ్లు పడుతుంది. బిల్డర్లు కూడా ప్రాజెక్టులో కొంత అమ్మి ఆ డబ్బుతో నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు స్టార్టింగ్ ఉన్న కాస్ట్ పూర్తి అయ్యాక భారీగా పెరుగుతోంది. సొంత ఇళ్లు, ఫ్లాట్ ఉన్న వాళ్లే పెట్టుబడి కోసం మళ్లీ కొంటున్నారు. రెంట్ ఇన్ కమ్ కోసం వాటిని కొనుగోలు చేస్తున్నారు.
ఒక్కో ఫ్లాట్ 2 వేల ఎస్ ఎఫ్ టీ పైనే ఉంటుంది. రూ.2 కోట్ల నుంచి రూ. 6 కోట్ల వరకు ఫ్లాట్లు, విల్లాలు అమ్ముతున్నారు. రూ.75 లక్షల లోపు ఉన్న అపార్ట్ మెంట్లు అసలు దొరకటం లేదు. సాధారణ మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసే పరిస్ధితి చాలా తక్కువ ఉంది. ప్రాపర్టీ షో ల్లో కూడా రూ.1 కోటి తక్కువ ప్లాట్ల గురించే వివరాలు అడుగుతున్నారు. ఖాళీగా ఫ్లాట్లు, టవర్లు ఉన్నాయనే ప్రచారం అవాస్తవం. ఖాళీగా అమ్ముడవకుండా ఉంటే పెద్ద ఎత్తున ఎందుకు నిర్మిస్తారనే విషయం మర్చిపోవద్దు. రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు.
–- ఇంద్రసేనారెడ్డి, క్రెడాయ్ స్టేట్ ప్రెసిడెంట్
